శ్వేతపత్రం వర్సెస్ స్వేదపత్రం: తగ్గనంటున్న కేటీఆర్; రేపే ముహూర్తం!!
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. రోజు వారి ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవలసిన పరిస్థితిలో రాష్ట్రం ఉందని, బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలలో రాష్ట్రం దివాలా తీసిందని పేర్కొన్నారు. ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్న భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర అప్పులు 6 లక్షల 71 వేల 757 కోట్లని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి అప్పులు 72,658 కోట్లుగా ఉంటే, సంవత్సరానికి 24.5 శాతం చొప్పున అప్పులు పెరిగినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారని, దానిని ఎట్టి పరిస్థితిలోనూ సహించబోమని తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం అంటూ వెల్లడించారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం అని తేల్చి చెప్పారు. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం అని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు..అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు అంటే రేపు చెమటోడ్చి సాగించిన తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై " స్వేద పత్రం " పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
ఒకపక్క కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల తెలంగాణ అంటుంటే.. మరొక బీఆర్ఎస్ పదేళ్ల తమ పాలనలో సాగించింది ప్రగతి తెలంగాణ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రం పరిస్థితిని, ఆర్థిక దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కోణంలో చూపిస్తే, తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధిని, సృష్టించిన సంపదను మరో కోణంలో చూపించే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. అధికార ప్రభుత్వానికి దీటుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వేద పత్రాన్ని వెల్లడించనుంది బీఆర్ఎస్.












Click it and Unblock the Notifications