ప్రచార రథం నుండి పడిపోయిన కేటీఆర్; గాయాలు!!
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మంచి రోజు కావడంతో జోరుగా నామినేషన్లు కొనసాగుతున్న వేళ ఆర్మూర్ నియోజకవర్గంలో నామినేషన్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూరులో నామినేషన్ ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో ప్రచార రథంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న మంత్రి కేటీఆర్ వాహనంపై నుండి ముందుకుపడ్డారు. అయితే స్వల్ప గాయాలు కావడంతో మంత్రి కేటీఆర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు అయింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈరోజు ఆర్మూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కు ముందు ఆయన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి తో పాటు మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు.

అయితే ర్యాలీ ముందుకు సాగుతున్న క్రమంలో కేటీఆర్ ప్రచార రథం డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. దీంతో కేటీఆర్ ఒక్కసారిగా ముందుకు పడిపోయారు. పక్కనే ఉన్న మాజీ ఎంపీ సురేష్ రెడ్డి పూర్తిగా కింద పడిపోయారు. జీవన్ రెడ్డి కూడా ముందుకు పడిపోయారు. ఇక ఈ ఘటనలో మంత్రి కేటీఆర్ తో పాటు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రచార రథం నుండి పడిపోయిన కేటీఆర్!!#KTR #ElectionCampaign2023 #BRSParty #TelanganaElections2023 #TelanganaElection2023 #TelanganaAssemblyElections2023 #TelanganaAssemblyElections #Oneindiatelugu pic.twitter.com/gyAcgnobKp
— oneindiatelugu (@oneindiatelugu) November 9, 2023
రోడ్ షో సందర్భంగా వెళుతున్న క్రమంలో విద్యుత్ తీగలు అడ్డురావడంతో వాహనానికి సడన్ బ్రేక్ వేయడంతో ప్రచార రథం పైన ఉన్న రెయిలింగ్ విరిగిపోయింది. దీంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రమాదం తర్వాత జీవన్ రెడ్డి ఆర్వో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగలేదని, తన ఆరోగ్య పరిస్థితి పైన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇక మంత్రి కేటీఆర్ కు ప్రమాదం జరిగిందని ఆందోళన చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు స్వల్పగాయాలే కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక మంత్రి కేటీఆర్ ఆర్మూరు నుండి కొడంగల్ రోడ్ షోలో పాల్గొనేందుకు వెళ్ళారు.












Click it and Unblock the Notifications