బీఆర్ఎస్ లో అనూహ్య పరిణామాలు- ఫామ్ హౌస్ కు సీనియర్ల క్యూ
బహిష్కారానికి గురైన మాజీ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలు, ఆరోపణలు.. భారత్ రాష్ట్ర సమితిలో కలకలం రేపుతున్నాయి. ఆమె రాజీనామా తర్వాత చోటు చేసుకుంటోన్న పరిణామాలు ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులను ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ఈ ఆరోపణలపై వివరణలను ఇచ్చుకునే పరిస్థితి తలెత్తింది. పార్టీకి జరిగిన డ్యామేజీని సరిదిద్దుకునే ప్రయత్నంలో పడేసింది.
కాళేశ్వరం అవినీతి పై మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత సంధించిన ఆరోపణలు.. దుమారం రేపుతున్నాయి. కుటుంబంలో కలతలు రావడానికి, పార్టీలో సంక్షోభం తలెత్తడానికి హరీష్ రావే కారణమని, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ కవిత విమర్శించిన విషయం తెలిసిందే. వీటన్నింటిపై తాజాగా తొలిసారిగా బహిరంగంగా స్పందించారు హరీష్ రావు.

విదేశీ పర్యటన ముగించుకుని ఈ తెల్లవారు జామున ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. కవిత చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. తాను చెప్పదలచుకున్నది సూటిగా చెప్పేశారు.
తన 25 సంవత్సరాల రాజకీయ జీవితం.. తెలంగాణ ప్రజల ముందు ఓ తెరిచిన పుస్తకం వంటిదని హరీష్ రావు పేర్కొన్నారు. కొంతకాలంగా తనపై, తన పార్టీపై కొన్ని రాజకీయ పార్టీలు చేసిన విమర్శలను వారి విజ్ఞతకే వదిలివేస్తున్నానని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాల కాలంగా ఓ క్రమ శిక్షణ గల కార్యకర్తగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో, అనంతరం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో ఎంతో నిబద్ధత చూపానని, అది ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు.
ఈ పరిణామాల మధ్య ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు పార్టీ సీనియర్ నేతలు క్యూ కట్టారు. పార్టీ అధినేత కేసీఆర్ తో సమావేశమౌతోన్నారు. కొద్దిసేపటి కిందటే హరీష్ రావు ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, లక్ష్మారెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ తో భేటీ అయ్యారు. మెదక్, సిద్ధిపేట్ జిల్లాలక చెందిన సీనియర్ నాయకులు వారి వెంట ఉన్నారు.
కవిత రాజీనామా వ్యవహారం, అనంతరం చోటు చేసుకుంటోన్న పరిణామాలపై కేసీఆర్ ఆరా తీస్తోన్నారు. ఆమె చేసిన విమర్శలు, ఆరోపణల ప్రభావం ఏ స్థాయిలో ఉందనే విషయంపై అడిగి తెలుసుకుంటోన్నారు. ఈ క్రమంలో త్వరలోనే జిల్లాలవారీగా పార్టీ నేతలతో ఆయన సమావేశమౌతారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications