'తెలంగాణలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం'
తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కాళేశ్వరం నీటిని వినియోగించకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయకపోవడం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ప్రేమ ఉంటే ఎగ్గొట్టిన మూడు రైతుబంధులతో పాటు యాసంగి రైతుబంధు కలిసి ఎకరానికి రూ.60 వేలు వెయ్యాలని డిమాండ్ చేశారు. అలానే కౌలు రైతులకు కూడా ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు సీజన్ల రైతుబంధు డబ్బులు వెయ్యాలన్నారు. భూమి లేని రైతు కూలీలకు నెలకు రూ. 1000 వేస్తామని అన్నారు. ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదన్నారు. రైతు కూలీలకు వెంటనే నెలకు వెయి రూపాయల చొప్పను 36 నెలలకు గానూ రూ.36 వేలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు రైతుబందు ఆపేశారు. రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం ప్రతినెలా ఈఎంఐ పడుతోంది. రాహుల్కు ఈఎంఐ కట్టకపోతే రేవంత్ రెడ్డి పదవి రెన్యువల్ కాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగలు అని.. ఇద్దరూ కలిసే దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోడీ మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు.

నీళ్లు ఇస్తే యూరియా ఇవ్వాలి, పంట కొనాలి, పంట బోనస్ ఇవ్వాలి.. ఇవన్నీ ఎగ్గొట్టడానికి కరెంట్ లేదు.. నీళ్లు లేవని అంటున్నారని ఆరోపించారు. ఎల్ నినో అనేది ఓ బక్వాస్ ముచ్చట అని, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను సరిగ్గా వాడుకొని ఉంటే.. ఒక్క మండలంలో కూడా కరువు పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలో బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రైతుగర్జన బహిరంగ సభ' కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా రైతులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. మార్గమధ్యంలో మేడ్చల్ దగ్గర కేటీఆర్ ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.












Click it and Unblock the Notifications
