మందుబాబులకు బిగ్ షాక్, మద్యం అమ్మకాల వేళల్లో మార్పులు..!!
మందుబాబులకు బిగ్ అలర్ట్. ఎప్పుడూ అందుబాటులో ఉండే మద్యం అమ్మకాలు ఇక నుంచి నిర్ణీత వేళలకే విక్రయాలు జరగనున్నాయి. లిక్కర్ షాపులు జనావాసాల మధ్యన లేకుండా ఊరు బయట మాత్రమే ఉండనున్నాయి. అక్కడ ఎమ్మెల్యే చొరవతో మద్యం వ్యాపారాల్లో మార్పు రానుంది. నేరుగా మద్యం వ్యాపారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఒప్పించారు. ఫలితంగా బెల్టు షాపులు లేకుండా చేసారు. ఈ మార్పు ఆ నియోజకవర్గంలో కొత్త చర్చకు కారణమవుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు ఉదయం వేళే తెరుచుకుంటాయి. అయితే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మునుగోడు నియోజకవర్గంలో మాత్రం వైన్‌షాపులు, ఊరు బయట ఉండాలని, అవి కూడా మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ఓపెన్ చేయాలని కొత్త రూల్స్ పెట్టారు. దీనికి అనుగుణంగా లిక్కర్ అమ్మకాల్లో వ్యాపారులు అమలు చేస్తున్నారు.

ప్రజల ఆరోగ్యం పాడుకావొద్దనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా నియోజకవర్గం లోని అందరి వైన్‌షాపు యజమానులతో మాట్లాడి ఇందుకు ఒప్పించారు. ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి వచ్చిన సందర్భంలో నియోజవర్గాల్లోని చాలా గ్రామాల్లో ప్రజలు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెరిగిపోవడంతో ఇంట్లోని మగాళ్లు పనులకు వెళ్లకుండా తాగుబోతులుగా మారుతున్నారని వాపోయారు.
ఈ కారణంగా యువత భవిషత్తు కూడా పాడవుతుందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని వైన్స్ షాపు యజమానులతో మాట్లాడి ఈ ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేయించారు. రూల్స్‌ను అతిక్రమించి ఎవరైనా మద్యం అమ్మితే వారిపై కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. అలాగే షాపులన్ని ఊరిబయటే.. అవి కూడా మధ్యాహ్నం తర్వాతే ఓపెన్ చేసేలా అమలు చేస్తున్నారు.
గ్రామాల్లో బెల్ట్ షాపులను లేకుండా చేయడం, మద్యం దుకాణా సమయాల్లో మార్పులు తీసుకురావడం వల్ల ప్రజలు మద్యానికి బానిస కారని కోమటిరెడ్డి ఆకాంక్షించారు. ఈ చర్యల వల్ల పొద్దు పొద్దున్నే మద్యం తాగే వారి సంఖ్య తగ్గుతుందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ సమయాలను రాత్రి 6 నుంచి 10 వరకు మాత్రమే ఉండేలా ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో ఈ మార్పు పైన సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మందు బాబులకు మాత్రం షాకింగ్ గా మారింది.












Click it and Unblock the Notifications