YouTuber Anvesh అరెస్ట్ తప్పదా? పోలీసుల అన్వేషణ
ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌కు గడ్డుకాలం మొదలైంది. సోషల్ మీడియాలో అతను చేసే వ్యాఖ్యలు, వీడియోలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ గతంలోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా హిందూ ధర్మం, భక్తుల మనోభావాలను కించపరిచేలా అసభ్యకర వీడియోలు విడుదల చేశారంటూ నటి కరాటే కల్యాణి గత ఏడాది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో తాజాగా పోలీసులు వేగంగా అడుగులు వేస్తున్నారు.
విశాఖపట్నానికి చెందిన అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ తన యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. అతను దేశంలో లేకపోవడంతో, ఏ ఎయిర్ పోర్టులో కనిపించినా వెంటనే అరెస్ట్ చేసేందుకు వీలుగా పోలీసులు 'లుకౌట్ నోటీసులు' (Lookout Circular) జారీ చేశారు. దీనివల్ల అతను భారతదేశంలో అడుగుపెట్టిన వెంటనే విమానాశ్రయ అధికారుల సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

Anvesh ఛానల్స్, అకౌంట్ల బ్లాక్:
కేవలం అరెస్ట్ మాత్రమే కాకుండా, అతని సోషల్ మీడియా ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని పోలీసులు నిర్ణయించారు. అన్వేష్‌కు చెందిన 2 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, 2 యూట్యూబ్ ఛానల్స్‌ను శాశ్వతంగా బ్లాక్ చేయాలని పంజాగుట్ట పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు (Meta, YouTube) అధికారికంగా లేఖలు రాయనున్నారు. ఇప్పటికే అతని సోషల్ మీడియా ఖాతా ఒకటి బ్లాక్ అవ్వగా, ఇప్పుడు అధికారికంగా మిగిలిన వాటిని కూడా మూసివేయించే ప్రక్రియ మొదలైంది.
సోషల్ మీడియాలో వ్యతిరేకత:
ఇటీవల కాలంలో అన్వేష్ ప్రవర్తన, అతను చేస్తున్న వీడియోల తీరుపై నెటిజన్లలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఒకప్పుడు ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఇప్పుడు అతను కొనితెచ్చుకుంటున్న సమస్యలు చూసి చీత్కరించుకునే వారి సంఖ్య పెరుగుతోందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పోలీసుల తాజా చర్యలతో అన్వేష్ యూట్యూబ్ ప్రస్థానానికి దాదాపు తెరపడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications