"మా" లో విష్ణు మార్క్ డెసిషన్ - ప్రకాశ్ రాజ్ ప్యానల్ అవుట్ : వారి స్థానంలో కొత్తగా..!!
"మా" లో ఇప్పుడు కీలక నిర్ణయం జరిగింది. కొద్ది నెలల క్రితం వరకు సాధారణ ఎన్నికలను తలపించే తరహాలో జరిగిన "మా" ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ విజయం సాధించింది. హోరా హోరీగా సాగిన ఆ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ వర్సెస్ విష్ణు గా ఎన్నికలు జరిగినా... రెండు వైపుల మద్దతు దారుల ప్రకటనలతో వాతావరణం హీటెక్కింది. ఇక, పోలింగ్ రోజున రెండు వర్గాల నుంచి గొడవలు జరిగాయి. మోహన్ బాబు తమను బూతులు తిట్టారని...కొట్టేందుకు వచ్చారంటూ సీనియర్ నటుడు బెనర్జీ ఆ తరువాత కన్నీటి పర్యంతమయ్యారు. విష్ణుకు మద్దతుగా నిలిచిన నరేశ్ పైన ప్రకాశ్ రాజ్ మద్దతు దారులు సీరియస్ అయ్యారు.

ఎన్నికల ప్రకటన నుంచే హోరా హోరీ
ఇక, ప్రాంతీయ వాదం సైతం తెర మీదకు వచ్చింది. విష్ణు ప్యానల్ గెలిచిన తరువాత ప్రకాశ్‌రాజ్, నాగబాబు లు తమ మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ.. మంచు విష్ణు వారి రాజీనామాలను ఆమోదించలేదు. వాటిని తిరస్కరించారు. ఆ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో 11 మంది సభ్యులు కూడా గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో గెలిచిన హీరో శ్రీకాంత్, ఉత్తేజ్‌లతో సహా 11 మంది రాజీనామాలు చేశారు. రాజీనామాల సమయంలో వారు ఎన్నికల్లో విష్ణు టీం వెనుక ఉన్న కొందరు వ్యవహరించిన తీరు పైన ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రకాశ్ రాజ్ ప్యాలన్ రాజీనామా ఆమోదం
విష్ణు తాను ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని..మరింత స్వేచ్చగా పని చేసుకొనేందుకు వీలుగా తాము రాజీనామాలు చేస్తున్నామని వారు ప్రకటించారు. అయితే, అధ్యక్షుడు విష్ణు వారిని రాజీనామాలు చేయవద్దని గత రెండు నెలలుగా సంప్రదింపులు జరిపారు. ఈ సంప్రదింపులు విఫలం కావడంతో 11 మంది రాజీనామాలను ఆమోదించినట్లు మంచు విష్ణు తెలిపారు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌కు చెందిన సభ్యుల రాజీనామా ఆమోదించడంతో నూతన కోరం కోసం వేరే సభ్యులను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

నాగబాబు - ప్రకాశ్ రాజ్ రాజీనామాల తిరస్కరణ
ఎన్నికల సమయంలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన వారి చేతుల్లో ఓడిన విష్ణు ప్యానల్ సభ్యులకే వారి స్థానాల్లో ఇప్పుడు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. వీరి ఎంపికకు సంబంధించి అధ్యక్షుడు..ఎగ్జిక్యూటివ్ కమిటీ తుది నిర్ణయం తీసుకొనే అధికారం ఉంది. దీని ద్వారా ప్రకాశ్ రాజ్ మద్దతు దారులకు ఇప్పుడు "మా" లో ప్రాతినిధ్యం లేదు. అయితే, వచ్చే ఎన్నికల నాటికి ఇతర ప్రాంతాలకు చెందిన వారు పోటీ చేయకూడదనే బైలాస్ మారుస్తామని గతంలో విష్ణు చెప్పారన్నారు.

కొత్త సభ్యులుగా విష్ణు మద్దతుదారులు
అలా మార్చకుండా ఉంటే తాను రాజీనామా విత్ డ్రా చేసుకోవటానికి అభ్యంతరం లేదని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. అయితే, విష్ణు మాత్రం దాని పైన తాము ఇంకా అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అదే సమయంలో విష్ణు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రక్రియ మాత్రం తాము ఖచ్చితంగా అడుతామని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేసారు. ఇప్పుడు విష్ణు తీసుకున్న నిర్ణయం పైన ప్రకాశ్ రాజ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications