MGBS వరద నుంచి బయట పడేది అప్పుడే, బిగ్ అలర్ట్ - తరలింపు..!!
మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తాయి. పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దసరా వేళ ఎంజీబీఎస్ పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. ఇక్కడి నుంచి ప్రయాణాలకు సిద్దమైన ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఎంజీబీఎస్ నుంచి బయల్దేరాల్సిన బస్సులను పలు ప్రాంతాల నుంచి నడుపుతున్నారు. ఎంజీబీఎస్ తో పాటుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు మొదలు పెట్టారు. కాగా, హైడ్రా రంగంలోకి దిగింది. వరద నీటి ప్రవాహం.. మరోసారి వర్షాల హెచ్చరిక వేళ అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.
దాదాపు 30 ఏళ్ల తరువాత మూసి వరద తీవ్ర స్థాయిలో వచ్చింది. ఇప్పటికీ మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. వరదల వల్ల పాతబస్తీ, అంబర్‌పేట, చాదర్‌ఘాట్ నుంచి ఎంజీబీఎస్ వరకు నీరు చేరింది. ఈ పరిస్థితి స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది.హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

మూసీ ఉద్ధృత ప్రవాహానికి గోల్నాకలోని అంబేద్కర్ నగర్ నీటి మునిగింది. దీంతో పలు కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. మూసీ ఒడ్డున ఉన్న మహాత్మగాంధీ బస్‌స్టేషన్(MGBS) నీట మునిగింది. వరద నీరు స్టేషన్‌లోకి చేరుకోవడంతో జిల్లాలకు వెళ్లాల్సిన, వివిద ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వరదను అంచనావేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వ విభాగాలు విఫలమయ్యారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంజీబీఎస్ వరద నీటిలో చిక్కుకొని ఉండటంతో.. ఇతర ప్రాంతాల నుంచి బస్సుల రాకపోకలు సాగిస్తున్నారు. దసరా పండుగకు ఊరెళ్తున్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సైబరాబాద్ ఐటీ కారిడార్ అతలాకుతలం అయింది.
సుమారు 26 ప్రధాన రహదారుల్లో వర్షపు నీళ్లు నిలిచిపోయి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వరదల్లో చిక్కుకున్న బాధితులకు బోట్ల ద్వారా ఆహారం అందజేస్తున్నారు. అనంతరం బాధితులందరినీ రక్షించి సురక్షిత ప్రాంతాలకు -తరలించారు. ఎంజీబీఎస్ ను హైడ్రా కమిషనర్ రంగనాధ్ పరిశీలించారు. అధికారులకు కీలక సూచనలు చేసారు. వరద ప్రవాహం అంచనా వేసారు. ఆదివారం మధ్యాహ్నం లేదా సోమవారం నుంచి తిరిగి ఎంజీబీఎస్ నుంచి బస్సుల రాకపోకలు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications