ఐటీ విచారణకు హాజరుకాని మంత్రి మల్లారెడ్డి.. ఐటీ అధికారులు వదిలిపెట్టినా మీడియా వదిలిపెట్టటం లేదట!!
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి నేడు ఐటి అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే మంత్రి మల్లారెడ్డి నేడు ఐటి అధికారుల విచారణకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, మల్లారెడ్డి తరఫున ఆడిటర్ విచారణకు హాజరు కానున్నారు.

ఐటీ విచారణకు హాజరు కాని మంత్రి మల్లారెడ్డి.. తన గైర్హాజరుపై చెప్పిందిదే
ఇక ఈ క్రమంలో తాను ఈ రోజు ఐటీ విచారణకు హాజరు కాకపోవడం పై స్పందించిన మంత్రి మల్లారెడ్డి తన తరఫున విచారణకు ఆడిటర్ హాజరవుతారని చెప్పారు. తాను ఉప్పల్ లో జరిగే పలు కార్యక్రమాలలో హాజరుకావలసి ఉన్న కారణంగా తాను విచారణకు హాజరు కాలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇక తన కుటుంబ సభ్యులు కూడా ఐటీ విచారణకు హాజరవుతున్నట్టు గా మల్లారెడ్డి తెలిపారు. అయితే ఐటీ అధికారులు పంపించిన నోటీసులలో విచారణకు మాత్రమే హాజరు కావాలని ఉందని, కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు తీసుకురావాలని అధికారులు చెప్పలేదని, అయితే విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

ఐటీ అధికారులు వదిలిపెట్టినా మీడియా వదిలిపెట్టటం లేదని వ్యాఖ్య
సీఎం కేసీఆర్ తనకు అండగా ఉన్నంతకాలం తనపై ఏ దాడులు పనిచేయవని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఇక ఇదే సమయంలో మీడియాపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి మల్లారెడ్డి తనను ఐటీ అధికారులు వదిలిపెట్టినా మీడియా మాత్రం వదిలిపెట్టడం లేదంటూ కామెంట్ చేశారు. అయితే మంత్రి మల్లారెడ్డి ఐటి అధికారుల విచారణకు హాజరు కాకపోతే ఐటీ అధికారులు ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డి ఇంత చేశాక ఐటీ అధికారులు ఆయనను వదిలిపెట్టరని చర్చ సాగుతుంది . మల్లారెడ్డి చేసిన పనికి ఐటీ అధికారులు ఆయనను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తారేమో అన్న చర్చ స్థానికంగా జరుగుతుంది.

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు , కేసులు
ఇటీవల మల్లారెడ్డి ఇళ్ళు, కార్యాలయాలపై, కాలేజీలపై, బంధువుల ఇళ్లపై దాడులు చేసిన ఐటీ అధికారులు రెండు రోజులపాటు మంత్రి మల్లారెడ్డి ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి పై ఐటీ దాడుల సమయంలో మల్లారెడ్డి ఐటి అధికారులపై చేసిన సంచలన వ్యాఖ్యలు వారిపై చేసిన ఫిర్యాదుతో మల్లారెడ్డిని ఐటీ అధికారులు టార్గెట్ చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి తన కుమారుడిని కొట్టారని, వేధించారని, బలవంతంగా సంతకాలు చేయించారని చేసిన వ్యాఖ్యలు.. ఆపై పెట్టిన కేసులు వెరసి తెలంగాణాలో పెద్ద చర్చ జరిగింది.

మల్లారెడ్డిపై చేసిన ఐటీ దాడుల్లో 15 మందికి నోటీసులు .. ఐటీ అధికారుల ముందు నేడు 14 మంది హాజరు
మల్లారెడ్డి తమ విధులను అడ్డుకున్నారని తమ ల్యాప్ టాప్ లాక్కుపోయారని ఐటి అధికారులు సైతం మల్లారెడ్డి పై ఎదురు ఫిర్యాదు చేశారు. దాడులకు సంబంధించి కీలక విషయాలను గుర్తించిన అధికారులు ఈ వ్యవహారంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు, బంధువులకు, వ్యాపార భాగస్వాములకు మొత్తం 15 మందికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ రోజు మల్లారెడ్డి కుమారులు మహేందర్ రెడ్డి భద్రారెడ్డి, మల్లారెడ్డి కోడళ్ళు, మల్లారెడ్డి కుమార్తె, అల్లుడు తోపాటుగా మల్లారెడ్డి కళాశాలల ప్రిన్సిపల్స్, మల్లారెడ్డి సమీప బంధువులు ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications