TGSRTC: ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలు.. ప్రకటించిన మంత్రి పొన్నం..!
నిరుద్యోగులకు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. టీజీఎస్ ఆర్టీసీలో త్వరలోనే ఉద్యోగాల నియామకాలు చేపడతామని ప్రకటించారు. ఆర్టీసీలో వివిధ విభాగాలకు చెందిన 3వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రి కరీంనగర్ లో 33 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో భాగంగా కరీంనగర్ లో 33 బస్సులు ఆదివారం ప్రారంభించినట్లు వివరించారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో 92 కోట్ల ఉచిత మహిళా టికెట్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మహిళల ఉచిత ప్రయాణానికి గానూ రూ.3200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. బతుకమ్మ, దసరాకు కూడా ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బస్సులు నడుపుతామని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ, కారుణ్య నియామకాలపై చర్చిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ లో డీజిల్ బస్సులు తగ్గించి.. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కాగా ఆదివారం అందుబాటులోకి తెచ్చిన 35 బస్సుల్లో ప్రయాణికులకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయి. ఈ బస్సుల్లో 41 సీట్లు ఉన్నాయి. ఈ బస్సులు ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లు ప్రయాణిస్తాయని చెబుతున్నారు. 2-3 గంటల్లో వంద శాతం పూర్తి ఛార్జింగ్ కావడమే గాకుండా క్యాబిన్ , సెలూన్‌లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్ పోస్టులు ఉండగా.. 743 శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్), 84 డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్), 25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్), 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్(సివిల్), 7 మెడికల్ ఆఫీసర్(జనరల్), 7 మెడికల్ ఆఫీసర్(స్పెషాలిస్ట్) ఉద్యోగాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications