రక్షణ ఎక్కడ.. "పెదనాన్న" కామానికి ఇంటర్ విద్యార్ధిని బలి !!
లైంగిక వేధింపులు, అత్యాచారాలకు ఫుల్ స్టాప్ మాత్రం పడట్లేదు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు అన్న తేడా లేకుండా మహిళలు, యువతులు కామాంధుల బారిన పడుతున్నారు. బయటివారి నుంచి మాత్రమే కాకుండా.. కుటుంబసభ్యులు సైతం వేధింపులకు పాల్పడిన ఘటనలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. సొంత వారి దగ్గర నుంచే రక్షణ కరువైనప్పటి నుంచి బాధితులు తమ కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
ఈ తరహా ఘటనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది. తండ్రి చనిపోయి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఓ కుటుంబానికి అండగా ఉండాల్సిన అతడి అన్న.. కన్నా కూతురి లాంటి బిడ్డపై కన్నేశాడు. పెదనాన్న తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో తట్టుకోలేక 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తీవ్ర కలకలంగా మారింది.

ఘటన వివరాలు..
నిజామాబాద్ జిల్లా వర్ని ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం మేడ్చల్ జిల్లా కొంపల్లికి వచ్చింది. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. పెద్ద కుమార్తె సుచిత్ర సమీపంలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఆమె తండ్రి తన అన్నతో కలిసి ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకున్నాడు. అయితే గతేడాది ప్రమాదంలో బాలిక తండ్రి మరణించడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది.
ఈ క్రమంలోనే మృతుడి సోదరుడు తరచూ వారి ఇంటికి వస్తుండేవాడు. అయితే బాలికను లైంగికంగా వేధించడం ప్రారంభించడంతో.. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్ధిని ఎవరికీ చెప్పుకోలేక మిన్నకుండిపోయింది. అయితే అతని ఆగడాలకు ఫుల్ స్టాప్ పడకపోవడంతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాసింది. అందులో పెదనాన్న లైంగిక వేధింపులు భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. బాలిక ఆత్మహత్యతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మరణానికి కారణమైన సదరు పెదనాన్నను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వేధింపులకు పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఎవరికైనా ఈ తరహా ఇబ్బందులు ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలని.. లేని పక్షంలో పోలీసులను సంప్రదించాలని కోరారు. ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదని వారికి తాము అండగా ఉండి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications