మహాశక్తి ఆలయంలో రాజాసింగ్ షాకింగ్ సంకల్పం!!
బిజెపి నుండి సస్పెన్షన్ ఎత్తివేయడంతో గోషా మహల్ ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి రాజాసింగ్ నేడు కరీంనగర్ లోని మహాశక్తి దేవాలయాన్ని బండి సంజయ్ తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 14 నెలల పాటు బిజెపికి దూరంగా ఉన్నానని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మునావర్ ఫరూఖీని కేటీఆర్ హైదరాబాద్ కు తీసుకువస్తే అడ్డుకున్నామని స్పష్టం చేసిన ఆయన, చివరకు తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినందుకు బిజెపి అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. బిజెపి అధికారంలోకి రావడానికి తను తన వంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పారు రాజా సింగ్. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని కేసీఆర్ ఫ్యామిలీని తరిమివేయాలని తాను సంకల్పం తీసుకున్నానని రాజా సింగ్ స్పష్టం చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణా పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బిజెపికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ చేయలేని బంగారు తెలంగాణను తాము చేసి చూపిస్తామని రాజాసింగ్ స్పష్టం చేశారు. కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా బరి లోకి దిగుతున్న బండి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని, బిజెపి గ్రాఫ్ తగ్గిందని కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని రాజా సింగ్ పేర్కొన్నారు. తాను తెలంగాణ రాష్ట్రంలో అధిష్టానం నిర్ణయం మేరకు ఎక్కడ ప్రచారం చేయమన్నా చేస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే 14 నెలల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయడంతో రాజాసింగ్ సంతోషానికి అవధులు లేవు.

అంతకు ముందు అనేక మార్లు తనపై సస్పెన్షన్ ఎత్తివెయ్యాలని రాజాసింగ్ బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఇక తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ ఆయనకు టికెట్ ఇచ్చారు. దీంతో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిన్న అడుగుపెట్టారు రాజా సింగ్. భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి వెళ్లిన రాజాసింగ్ కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల గురించి తనదైన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications