MLC Kavitha: తీహార్ జైల్లో కవిత విన్నపాలు వినవలె..!!
కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. జైల్లో తనకు సరిగ్గా వసతులు కల్పించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కవిత కోర్టును విన్నపాలు వినవలె అంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇంతకీ కవిత తీహార్ జైల్లో పడుతున్న ఇబ్బందులు ఏమిటి అంటే..
కవితను రిమాండ్ ఖైదీగా రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించే సమయంలో కవితకు పలు సదుపాయాలు కల్పించాలని, ఆమెకు ఇంటి భోజనం అనుమతించాలని కోర్టు ఆదేశించింది. అయితే తీహార్ జైల్లో కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయటం లేదు. దీంతో కవిత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

తనకు ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదని, పరుపులు ఏర్పాటు చేయలేదని , కనీసం తన చెప్పులను కూడా లోనికి అనుమతించలేదని కవిత ఆరోపిస్తున్నారు. పెన్నులు, పేపర్లు అందుబాటులో ఉంచలేదన్నారు. బట్టలు, బెడ్ షీట్లు, పుస్తకాలు ఏమీ ఇవ్వడం లేదని, కనీసం తన కళ్ళజోడును కూడా అనుమతించడం లేదని ఎమ్మెల్సీ కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చేతికి ఉన్న జపమాలను కూడా అనుమతించలేదని కవిత తాను దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. తీహార్ జైలు అధికారులు చేసిన నిర్వాకం పట్ల తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత తాను దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. తాను మహిళలకు సంబంధించి అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, వాటికి తోడు తనకు రక్తపోటు అధికంగా ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే తన అనారోగ్య సమస్యలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన కవిత, కోర్టు తనకు జైలులో వసతులు కల్పించాలని ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిందని, కానీ తీహార్ జైలు అధికారులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశించినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత తన విన్నపాన్ని విని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
తాను దాఖలు చేసిన పిటిషన్ ను విచారించాలని కవిత కోర్టులో పేర్కొన్నారు. ఈ మేరకు పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం రేపు కవిత దాఖలు చేసిన పిటీషన్ ను విచారించనుంది. మరి ఈ విచారణలో కవిత విన్నపాలు కోర్టు వింటుందా అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications