రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత; కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరనున్న ఈడీ అధికారులు!!
సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిన్న సాయంత్రం ఈడిఅధికారులు అరెస్టు చేసి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని కవిత నివాసంలో దాదాపు 5గంటలపాటు సోదాలు నిర్వహించి, విచారణ జరిపిన ఈడి అధికారులు, ఆమెను అదుపులోకి తీసుకుని నేరుగా ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ విమానాశ్రయం నుండి ఎమ్మెల్సీ కవితను ఈడి కార్యాలయానికి తీసుకువెళ్లారు. దీంతో రాత్రంతా ఆమె ఈడి కార్యాలయంలోనే గడిపారు.
నేడు కవితకు వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం నేడు ఉదయం పదిన్నర గంటలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ఈడి అధికారులు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కుంభకోణం లో కవితను లోతుగా విచారించడానికి వారు ఆమెను కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టు అనుమతి కోరనున్నారు. కవితని కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరనున్న క్రమంలో కోర్టు కవితను ఈడి అధికారుల కస్టడీకి ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కెసిఆర్ కుమార్తె కవిత బినామీ పేర్లతో అక్రమార్జన చేశారని కవిత పై అభియోగాలు ఉన్నాయి. అక్రమార్జన ద్వారా ఇండో స్పిరిట్ లో పార్ట్నర్ షిప్ పొందారని, అరుణ్ రామచంద్ర పిళ్ళై ద్వారా వ్యవహారాలు నడిపారని ఆరోపిస్తున్న ఈడీ అధికారులు ఈ కేసులో కవిత పాత్రకు సంబంధించిన పలు ఆధారాలను సేకరించారు.
ఈ కేసులో ఇప్పటివరకు విచారణ జరిపిన అరుణ్ రామచంద్ర పిళ్ళై, ఆడిటర్ బుచ్చిబాబు, అశోక్ కౌశిక్ , మాగుంట రాఘవ తదితరుల వాంగ్మూలంలో కవిత పేరు ప్రధానంగా ఉండడాన్ని కూడా ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిన్న కవిత ఇంటిపై దాడి చేసిన ఈడి అధికారులు, ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు.
ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కవితను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఇవ్వాలని కోరనున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ చోటుచేసుకుంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితర ముఖ్య నేతలు నేడు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ కేసు విషయంలో వారు న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. కవితకు నైతికంగా మద్దతుగా నిలబడనున్నారు.












Click it and Unblock the Notifications