పుష్ప 2 కలెక్షన్లల్లో 10 శాతం శ్రీతేజ్ కుటుంబానికి..
Sritej health: ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన.. మరింత విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్.. బ్రెయిన్ డ్యామేజ్‌కు గురయ్యాడు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు.

డాక్టర్ చేతన్ ఆర్ ముందాడ, డాక్టర్ విష్ణు తేజ్ పూడి పర్యవేక్షణలోని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటోన్నాడు. అత్యాధునిక వైద్య సహాయాన్ని అందిస్తోన్న నేపథ్యంలో కోలుకుంటాడని అందరూ భావించినప్పటికీ అది నెరవేరట్లేదు. సంఘటన చోటు చేసుకున్న ఈ నెల 4వ తేదీ నుంచీ కన్ను కూడా తెరవలేదా బాలుడు. ఇప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ శాసన మండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న.. కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్‌ను పరామర్శించారు. ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రిపోర్టులను పరిశీలించారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయన ఆసుప్రతిలోనే గడిపారు.
అనంతరం ఆసుపత్రి ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఎప్పుడు కోలుకుంటాడనే విషయాన్ని డాక్టర్లు సైతం చెప్పలేకపోతున్నారని అన్నారు. శ్రీతేజ్ బ్రెయిన డ్యామేజ్ అయినట్లు డాక్టర్లు చెబుతున్నారని పేర్కొన్నారు. తొక్కిసలాట సమయంలో మెదడు తీవ్ర ఒత్తిడికి గురి కావడం వల్ల ఆక్సిజన్ అందట్లేదని డాక్టర్లు వివరించారని అన్నారు.

బెనిఫిట్, ప్రీమియర్ షోల పేరుతో అభిమానుల ప్రాణాలతో సినిమా రంగం చెలగాటం ఆడుతోందని, ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోతోందని, తీన్మార్ మల్లన్న విమర్శించారు. ఈ వ్యవహారాలన్నింటిపైనా శాసన మండలిలో ప్రస్తావనకు తీసుకొస్తానని, దీన్ని ఎలా నివారించాలనే విషయంపై మాట్లాడతానని అన్నారు. ఆ ఉద్దేశంతోనే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వచ్చానని చెప్పారు.
పుష్ప 2 సినిమాకు 1,400 నుంచి 1,500 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చినట్లు వార్తలు వస్తోన్నాయని, ఇందులో 10 శాతం మొత్తాన్ని శ్రీతేజ్ కుటుంబానికి చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకుని రాలేమని, ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగవని అన్నారు.












Click it and Unblock the Notifications