నిరంకుశ పాలన అంతానికి కలిసికట్టుగా పని చెయ్యాల్సిన అవసరం: టీజేఎస్ కోదండరాం!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇక తాజాగా బిజెపి జనసేనతో కలిసి ముందుకు సాగడానికి సిద్ధం కాగా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం భేటీ కావడం, పొత్తులపై చర్చించడం ఆసక్తికరంగా మారింది.
రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన కోదండరాం రాష్ట్రంలో నిరంకుశ పాలనను అంతం చేయడానికి మనం తప్పక కలిసి పనిచేద్దామని కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. తాము కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఒంటరిగా అనుకున్న లక్ష్యాలను సాధించలేమని రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో చర్చించామని చెప్పారు.

కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిర్వహిస్తున్న బస్సు యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీని కలిశానని పేర్కొన్న ఆయన రాష్ట్రంలో నిరంకుశ పాలనను అంతం చేయడానికి తాము పదేళ్లుగా కృషి చేస్తున్నామన్నారు. తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఈ పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. ఇద్దరూ కలిసి పనిచేస్తే మార్పు సులభతరం అవుతుందని రాహుల్ గాంధీ అన్నారని కోదండ రామ్ పేర్కొన్నారు.
సమాజంలో ఉన్న అసమానతలు నిర్మూలించడంతో పాటు, ఆర్ధిక అసమానతలను తొలగించకుండా భారత దేశంలో ప్రజాస్వామ్యం అనేది సాధ్యం కాదని, దానికోసమైనా మనం దీర్ఘకాలికంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని రాహుల్ గాంధీ అన్నారని కోదండ రామ్ తెలిపారు. మరోమారు వీరిద్దరి పొత్తులపై భేటీ జరిగితే టీజేఎస్ కు ఎన్ని సీట్లు ఇస్తారో క్లారిటీ వస్తుంది. సీట్ల సర్దుబాటు జరిగితే ఈ రెండు పార్టీల పొత్తు ఖరారు అయినట్టే అని భావించొచ్చు.












Click it and Unblock the Notifications