అత్యధిక ఉష్ణోగ్రతలు: హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో 4 రోజులు అలర్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం హైదరాబాద్ నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ గురువారం నాడు నమోదైన ఉష్ణోగ్రతే అత్యధికం కావడం గమనార్హం. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం(TSDPS) వెల్లడించింది.
హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మరో నాలుగు రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని పేర్కొంది.
హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో ఉష్ణోగ్రత 39.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. సైదాబాద్‌లో 39 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కామారెడ్డి జిల్లా భిక్నూర్‌లో నమోదైంది. ఈ మండలంలో 43.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. కామారెడ్డి తర్వాత నిర్మల్‌లో అత్యధికంగా 42.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

త్వరలో హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోనుంది. ఏప్రిల్ 2 వరకు రాష్ట్రంలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు 37-41 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు, కొన్ని ప్రాంతాల్లోఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్‌లో ఏప్రిల్ 2 వరకు గరిష్ట ఉష్ణోగ్రత 35-38 డిగ్రీల సెల్సియస్‌లో నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపింది. ఏప్రిల 3 వరకు నగరంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో త్వరలోనే 40 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణకు ఎల్లో అలర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌కు మాత్రం ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఇళ్ల నుంచి బయటికి వెళ్లేటప్పుడు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ, టీఎస్‌డీపీఎస్ సూచనలు చేశాయి.
రంజాన్ సందర్భంగా వేసవి తాపం పెరుగుతున్నందున సెహ్రీ సమయంలో తగినంత నీరు తాగడం అవసరమని తెలిపింది. ఉపవాసం ఉండే వ్యక్తి కనీసం రోజంతా రెండు లీటర్ల నీరు తాగితే హైడ్రేట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. ఎండలో తిరిగే వ్యక్తులు వదులుగా, లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం కూడా వేడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.












Click it and Unblock the Notifications