అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో అన్న NTR విగ్రహం: రేవంత్‌రెడ్డి
అమీర్ పేట మైత్రీవనం చౌరస్తాలో అన్న నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయించి ముఖ్యమంత్రిగా తానే ఆవిష్కరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్న నందమూరిని అభిమానించనివారంటూ ఎవరూ ఉండరని, అటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని పెట్టకుండా అడ్డుపడ్డ దుర్మార్గుడు కేసీఆర్ అని రేవంత్ మండిపడ్డారు. ఆ దుర్మార్గుడిని మూసీలో వేసి బొంద పెడతానన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న నవీన్ యాదవ్ తరఫున ప్రచారం నిర్వహించిన రేవంత్ వెంగళరావునగర్, ఎల్లారెడ్డిగూడలో పర్యటించారు.
3 గంటలు మహిళలను ఎండలో నిలబెట్టిన దుర్మార్గుడు
మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మొత్తం 294 సీట్లకు టీడీపీకి 216 సీట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలకే పరిమితమైంది. మిగతా సీట్లు టీడీపీ మిత్రపక్షాలకు వచ్చాయి. ఆ సమయంలో శాసనసభలో పీజేఆర్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. అటువంటి వ్యక్తి 2007లో గుండె ఆగి చనిపోతే అప్పుడు చంద్రబాబునాయుడు.. ఏకగ్రీవం చేద్దాం.. టీడీపీ తరఫున పోటీకి ఎవరినీ నిలబెట్టమని చెప్పారు. అయితే కేసీఆర్ మాత్రం కావాలని అభ్యర్థిని నిలబెట్టి అప్పటి వరకు ఉన్న మంచి సంప్రదాయాన్ని చెడగొట్టి దుష్ట సంప్రదాయానికి నాంది పలికాడు.

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించే బాధ్యత నవీన్ యాదవ్ దే
ఆ సమయంలో పీజేఆర్ భార్య, పిల్లలు... చంద్రబాబు మాకు అండగా నిలబడ్డాడు.. ఎన్నికను ఏకగ్రీవం చేద్దాం.. మీరు కూడా సహకరించండని అడగడానికి కేసీఆర్ ఇంటికి వెళితే.. మహిళలని కూడా చూడకుండా గేటు బయట ఎండలో మూడు గంటలు నిలబెట్టిన కనికరం లేని కసాయి అని, కావాలంటే ఇక్కడే ఉన్న పీజేఆర్ కూతురు విజయారెడ్డిని అడగండంటూ ప్రజలకు రేవంత్ ఆమెను చూపించారు.
అందరం అన్న అని అభిమానంగా పిలుచుకునే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించే బాధ్యతను నవీన్ యాదవ్ కు అప్పజెబుతున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్, చంద్రబాబుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్ ను బిల్లారంగా అని పోల్చారు. వెంగళరావునగర్, ఎల్లరెడ్డిగూడలో మాట్లాడిన సందర్భంలో కేసీఆర్ పై, కేటీఆర్ పై నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications