గ్యారెంటీలను టిష్యూ పేపర్లతో పోల్చిన కవిత
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.
వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. అభ్యర్థులకు బీఫామ్‌లను అందజేశారు.

ఇక ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తోంది బీఆర్ఎస్. ఇందులో భాగంగా నేడు కేసీఆర్- జనగామ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు జనగామ సభలో ఏర్పాటు చేసే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదే సభలో- మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉంది.
ఎన్నికల మేనిఫెస్టోపై బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. తమను చూసి బీజేపీ ఎన్నో సంక్షేమ పథకాలను నేర్చుకుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం స్ఫూర్తి పొందారని అన్నారు.
తమ సంక్షేమ పథకాలనే ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు దేశం పట్ల ప్రేమాభిమానాలు ఉంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవద్దని, అనవసరమైన అడ్డంకులు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయిందని గుర్తు చేశారు కవిత.
ఈ సారి కూడా అలాంటి పరిస్థితినే బీజేపీ ఎదుర్కొంటుందని, మొత్తం 119 నియోజకవర్గాల్లో బీజేపీకి డిపాజిట్లు దక్కకుండా చేస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టో ప్రకటనతోనే సగం గెలిచినట్లు భావిస్తోన్నామని కవిత చెప్పారు. మేనిఫెస్టో వెలువడగానే బీజేపీ, కాంగ్రెస్ రెండూ భయాందోళనలకు గురయ్యాయని అన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తోన్న హామీలు, ఆ పార్టీ మేనిఫెస్టో టిష్యూ పేపర్లతో సమానమని కవిత విమర్శించారు. తాము ఎప్పటికీ అధికారంలోకి రాలేమనే విషయం కాంగ్రెస్‌కు తెలిసిపోయిందని, అందుకే గ్యారెంటీ పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేస్తోన్న హామీలు టిష్యూ పేపర్లు తప్ప మరేమీ కావని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications