హైదరాబాద్ లో భారీ రేవ్ పార్టీ- పోలీసుల వలలో
హైదరాబాద్ లో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. నగర శివార్లలోని మహేశ్వరం వద్ద ఓ రిసార్ట్ లో అర్ధరాత్రి పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. పలువురిని అరెస్ట్ చేశారు. కొన్ని రకాల డ్రగ్స్, అనుమతి లేకుండా విక్రయిస్తోన్న ఫారిన్ లిక్కర్, నగదును భారీ మొత్తంలో స్వాధీనం చేసకున్నారు. హైదరాబాద్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ లభిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా రేవ్ పార్టీ వెలుగులోకి రావడం చర్చనీయాంశమౌతోంది.
మహేశ్వరం మండలంలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రేవ్ పార్టీ నిర్వహిస్తోన్నట్లు సమాచారం అందడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు, పోలీసులతో కూడిన ఎస్ఓటీ టీమ్ స్థానిక కే చంద్రారెడ్డి రిసార్ట్ పై మెరుపుదాడి చేసింది. 14 మంది మహిళలు సహా మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకుంది. గుంటూరుకు చెందిన ఓ ఫర్టిలైజర్స్ కంపెనీ యాజమాన్యం డీలర్ల కోసం ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

అరెస్టయిన వారిలో కొందరు బార్ డాన్సర్లు, ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులు, డీలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తుగా ఎటువంటి అనుమతి లేకుండా మద్యాన్ని విక్రయిస్తోన్నందున డీలర్ల కోసం భారీ మొత్తంలో ఫారిన్ లిక్కర్, డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీ నిర్వాహకుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో తరచూ రేవ్ పార్టీ ఉదంతాలు వెలుగులోకి వస్తోన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో కొండాపూర్ లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా దీన్ని భగ్నం చేశారు అప్పట్లో. ఇద్దరు పెడ్లర్లు, ఓ డ్రగ్ ట్రాన్స్‌పోర్టర్ సహా పలువురిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద రూ. 10 లక్షల విలువైన కొకైన్, ఎక్స్‌టసీ టాబ్లెట్స్, పెద్ద మొత్తంలో ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. సరిగ్గా రెండు నెలల్లోనే మరో రేవ్ పార్టీ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.












Click it and Unblock the Notifications