తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణంపై మంత్రి క్లారిటీ
Ponnam Prabhakar: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి వ్యతిరేకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇలాంటి ఉచిత పథకాల వల్ల మెట్రో రైళ్ల వ్యవస్థ దెబ్బతింటుందని, వాటికి ఆదాయం పడిపోతుందంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులముకొన్నాయి.
తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ఏపీలో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ప్రకటించాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచాయి.

ఈ పథకం సరికాదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర తప్పు పట్టారు. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొన్ని రాష్ట్రాలు మహిలలకు ఆర్థిక వెసలుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తోన్నాయని చెప్పారు.
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల మెట్రో రైలు వ్యవస్థ దెబ్బతింటుందనడంలో అర్థం లేదని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రోజురోజుకూ మెట్రో రైళ్లకు ఆదరణ పెరుగుతోందని, వాటి ర్యాక్స్‌ను పెంచాల్సిన అవసరం ఉందంటూ అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోన్నాయని గుర్తు చేశారు.
మెట్రో రైలు బోగీలను పెంచడం, ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను కల్పించడాన్ని వదిలిపెట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదని అన్నారు. రాజకీయంగా లబ్ది పొందాలనే ఉద్దేశంతోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న తమ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగించి తీరుతుందని ఆయన హామీ ఇచ్చారు. దీనికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూట్లు, బస్సుల సంఖ్యను పెంచుతామనీ అన్నారాయన.
మహిళకు ఆర్థికంగా ఎంతో వెసలుబాటు కల్పిస్తోన్న మహాలక్ష్మి పథకంపై మోదీ విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. మహిళలపై ఆడిపోసుకోవడాన్ని బంద్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళలను కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ప్రధాని హోదాను దిగజార్చవద్దని కోరారు.












Click it and Unblock the Notifications