తెలంగాణలో బీజేపీకి రిపేర్లు- హుటాహుటిన ఇన్‌ఛార్జ్ అపాయింట్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. గడువు సమీపిస్తోండటంతో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాయి. జిల్లాల పర్యటనలతో అధికార భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలకు ఇదివరకే శ్రీకారం చుట్టారు.
ఇటీవలే ఖమ్మం జిల్లాలో నిర్వహించిన తెలంగాణ జన గర్జన సభతో కాంగ్రెస్ ఊపులోకి వచ్చింది. ఈ సభకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇదే సభలో ఎన్నికల తొలి హామీని ప్రకటించింది కాంగ్రెస్. తాము అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచుతామని ప్రకటించింది.

ఈ రేసులో భారతీయ జనతా పార్టీ కాస్త వెనుకంజలో పడింది. అంతర్గత కుమ్ములాటలతో సతమతమౌతోంది. ఈ క్రమంలో ఏకంగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడే ఉద్వాసనకు గురి కావాల్సి వచ్చింది. బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి- బీజేపీ రాష్ట్రశాఖ పగ్గాలను అందుకున్నారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన వరంగల్ పర్యటనతో గేరు మార్చాలని భావిస్తోంది.
ప్రధాని మోదీ వరంగల్ సభను విజయవంతం చేయడం ద్వారా మళ్లీ పట్టాలెక్కాలనే కృతనిశ్చయంతో ఉన్నారు బీజేపీ నాయకులు. మోదీ సభ ఏర్పాట్లల్లో తీరిక లేకుండా గడుపుతోన్నారు. కనీసం అయిదు లక్షలమందిని సమీకరించాలని నిర్ణయించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే కాకుండా పొరుగు ప్రాంతాల నుంచీ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలించడానికి సమాయాత్తమౌతోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య బీజేపీ అధిష్ఠానం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తెలంగాణకు మరో ఇద్దరు సీనియర్ నేతలను అపాయింట్ చేసింది. కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్‌కు కీలక బాధ్యతలను అప్పగించింది. ప్రకాష్ జవదేకర్ తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జీగా, సునీల్ బన్సాల్ కో ఇన్‌ఛార్జీగా అపాయింట్ అయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన జారీ చేశారు.
తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌కూ ఎన్నికల ఇన్‌ఛార్జ్, కోఇన్‌ఛార్జీలను అపాయింట్ చేశారు. రాజస్థాన్- ప్రహ్లాద్ జోషి, నితిన్ పటేల్, కుల్‌దీప్ బిష్ణోయ్, ఛత్తీస్‌గఢ్- ఓం ప్రకాష్ మాథుర్, డాక్టర్ మన్‌సుఖ్ భాయ్ మాండవీయ, మధ్యప్రదేశ్- భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్‌ను నియమించారు.












Click it and Unblock the Notifications