'పుష్ప' సినిమా స్టైల్‌లో ఆవుల స్మగ్లింగ్.. నివ్వెరపోయిన పోలీసులు! (వీడియో)
అక్రమ రవాణాదారులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. సినీ ఫక్కీలో స్మగ్లింగ్ చేస్తూ పోలీసుల కళ్లు గప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో 'పుష్ప' సినిమా తరహాలో జరిగిన ఆవుల అక్రమ రవాణా ఉదంతం కలకలం రేపింది. నిందితులు ఆవులను తరలిస్తున్న లారీని ఎవరికీ అనుమానం రాకుండా సిద్ధం చేశారు. లారీ లోపల 70కి పైగా ఆవులను కుక్కి బయటకు కనిపించకుండా లారీ పైభాగం మొత్తం టార్పాలిన్‌తో ప్రత్యేకంగా కప్పి ఉంచారు. పైకి చూస్తే ఏదో సాధారణ సరుకు వెళ్తున్నట్లుగా భ్రమ కలిగించేలా ఈ ఏర్పాటు చేశారు.
డబుల్ నెంబర్ ప్లేట్ స్కెచ్
పోలీసుల తనిఖీల్లో దొరక్కుండా ఉండేందుకు నిందితులు మరో తెలివైన ఎత్తుగడ వేశారు. సదరు లారీకి ఒకవైపు హర్యానా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేటును, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేటును అమర్చారు. రాష్ట్ర సరిహద్దులు దాటేటప్పుడు అధికారులను గందరగోళానికి గురిచేయడమే వీరి ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.

పట్టుకున్న గోరక్షక కార్యకర్తలు
విశ్వసనీయ సమాచారం అందుకున్న గోరక్షక కార్యకర్తలు అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఈ లారీని వెంబడించి పట్టుకున్నారు. టార్పాలిన్‌ను తొలగించి చూడగా.. లోపల అత్యంత దారుణంగా 70కి పైగా ఆవులను తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించి, నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ ఆవులను ఎక్కడి నుండి తీసుకువస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవులను సంరక్షణ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications