చర్లపల్లి నుంచి అరుణాచలానికి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు
పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ పండగల సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
తాజాగా చర్లపల్లి- తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 6వ తేదీన ఈ రైలు పట్టాలెక్కుతుంది. నవంబర్ 18వ తేదీ వరకు ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించనుంది. అరుణాచలానికి వెళ్లాలనుకునే వారికి ఈ రైలు ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ కోసం ఈ ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది.

ఈ నెల 6, 13, 20, 27, నవంబర్ 3, 10, 17 తేదీల్లో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2:20 నిమిషాలకు చర్లపల్లి నుండి బయలుదేరే నంబర్ 07003 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరువణ్ణామలైకి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో.. ఈ నెల 7, 14, 21, 28, నవంబర్ 4, 11, 18 తేదీల్లో ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు తిరువణ్ణామలై నుండి బయలుదేరే నంబర్ 07004 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
కాచిగూడ, షాద్ నగర్, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఏసీ టూ టైర్ కోచ్- 3, ఏసీ త్రీ టైర్ కోచ్‌లు- 5, స్లీపర్ క్లాస్ కోచ్‌లు- 10, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు- 4 అందుబాటులో ఉంటాయి. ఈ రైలుకు ఈ ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ ఆరంభమైంది కూడా.












Click it and Unblock the Notifications
