తెలంగాణలో ఆ శాఖలో ఫుల్ అవినీతి .. 2025లో పట్టుబడిన అవినీతి అధికారులు ఎందరంటే
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతిపైన అవినీతి నిరోధక శాఖ తన పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ సంవత్సరం లంచగొండి అధికారుల భరతం పట్టిన ఏసీబీ భారీగా అవినీతి అధికారులను పట్టుకొని సరికొత్త రికార్డును నమోదు చేసింది. 2025 సంవత్సరంలో ఏసీబీ 250కి పైగా కేసులను నమోదు చేసి, 150 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది.
నీటిపారుదల శాఖలోనూ, రెవిన్యూ విభాగాలలోనూ అధికంగా కేసులు
గత సంవత్సరం 2024లో 152 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో పోలిస్తే ఈ సంవత్సరం అదనంగా 70 కేసుల వరకు నమోదయ్యాయి. పట్టుబడిన వారిలో అధిక శాతం రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటూ దొరికిన వారే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో నీటిపారుదల శాఖలోనూ, రెవిన్యూ విభాగాలలోనూ అధికంగా కేసులు నమోదయ్యాయి. ప్రాజెక్టు బిల్లులకు క్లియరెన్స్ కోసం ప్రజలను వేధించిన అధికారులు, భూముల వ్యవహారాలలో లంచాలు తీసుకున్న అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు.

ఆదాయానికి మించి ఆస్తుల కేసులలో 17మందికి పైగా అధికారులపై చర్యలు
ఇటీవల రవాణా శాఖలో జరిగిన సోదాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఒకే అధికారి వద్ద వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఉండడం ఉన్నతాధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులలో 17మందికి పైగా అధికారులపై ఏసీబీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వారి నుండి కిలోల కొద్ది బంగారాన్ని, భారీ నగదును, స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఏడాది చాలామంది బాధితుల కంప్లైంట్స్
అవినీతిరహిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ఏసీబీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అధికారులను అరెస్టు చేయడమే కాకుండా వారిని సర్వీస్ నుంచి తొలగించి, ఆస్తులను జప్తు చేయడానికి కూడా చట్టపరమైన చర్యలను వేగవంతం చేస్తున్నారు అధికారులు. ఏసీబీ ఈ సంవత్సరం ఫిర్యాదుల కోసం వాట్సాప్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా అందుబాటులోకి తీసుకురావడంతో, చాలామంది బాధితులు భయం లేకుండా ముందుకు వచ్చి తమకు కలుగుతున్న ఇబ్బందిని తెలియజేస్తున్నారు.
2025 సంవత్సరంలో ఏసీబీ అధికారుల మంచి పనితీరు
ప్రభుత్వ అధికారులు ఏదైనా పనులకు డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీని సంప్రదించాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఈ అవినీతిని కూకటివేళ్లతో పెకలించటానికి, వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి అందరూ సహకరించాలని వారు కోరుతున్నారు. ఏసీబీ చేపట్టిన మెరుపు దాడులతో ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. మొత్తానికి 2025 సంవత్సరంలో ఏసీబీ అధికారులు మంచి పనితీరును కనపరిచి, ఎక్కువ మంది అవినీతి అధికారుల భరతం పట్టారు.












Click it and Unblock the Notifications