అల్లు అర్జున్ బంధువే, కానీ.. అరెస్టుపై ఆజ్‌తక్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం మధ్యాహ్నం సినీనటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడంతో 14 రోజుల రిమాండ్ విధించింది.
అయితే, హైకోర్టుశుక్రవారం సాయంత్రం అల్లు అర్జున్‌కు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన మరికాసేపట్లో విడుదల కానున్నారు. కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియా ఛానల్ ఆజ్‌తక్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్టు విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

అల్లు అర్జున్ సైలెంట్‌గా వచ్చి వెళితే..
సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ ప్రాణం పోయిందని.. ఆమె కొడుకు జీవన్మరణ స్థితిలో ఉన్నాడని చెప్పారు. ప్రస్తుతం కోమాలో ఉన్న బాలుడు.. స్పృహలోకి వస్తే అతనికి తల్లి ఉండదని.. అతని జీవితం ఎలా ఉంటుందో ఎవరైనా అడుగుతారా? అని ప్రశ్నించారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. జనం ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా? అని రేవంత్ ప్రశ్నించారు. ఘటనపై క్రిమినల్ కేసు నమోదైందని చెప్పారు. ఫిలింస్టార్, పొలిటికల్ స్టార్స్ కోసం ప్రత్యేకంగా ఏమీ ఉండదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అల్లు అర్జున్.. కారులో వచ్చి సైలెంట్‌గా సినిమా చూసివెళితే సమస్య ఉండకపోయేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, కారులోంచి బయటకొచ్చి హడావుడి చేశారు. దీంతో జనం ఒక్కసారిగా ఎగబడటంతో కంట్రోల్ చేయలేకపోయారని సీఎం రేవంత్ వివరించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి, చంద్రశేఖర్ కాంగ్రెస్ నేతలే
అల్లు అర్జున్ మేనమామ చిరంజీవి, పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ (స్నేహారెడ్డి తండ్రి) కాంగ్రెస్ నేతలేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేగాక, అల్లు అర్జున్ భార్య కుటుంబం తనకు బంధువులేనని రేవంత్ చెప్పుకొచ్చారు. హోంశాఖ తన వద్దే ఉన్నారని.. కేసుకు సంబంధించి రిపోర్టు తనకు తెలుసని సీఎం రేవంత్ చెప్పారు.
సినిమా వాళ్లు వ్యాపారులే.. దేశం కోసం ఏం చేశారు?
సినిమావాళ్లు చేసేది వ్యాపారమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పైసలు పెట్టారు.. లాభాలు సంపాదించారన్నారు. సినిమా వాళ్లు దేశానికి చేసిదేమీ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో ఇచ్చిపుచ్చుకునేది ఏమీ లేదన్నారు. కాగా, అంతకుముందు అల్లు అర్జున్ అరెస్టుపై స్పందిస్తూ చట్టం తన పని తాను చేస్తోందని రేవంత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
నేనే స్టార్ అంటూ రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
మీకు నచ్చిన తెలుగు సూపర్ స్టార్ ఎవరంటూ న్యూస్ యాంకర్ ప్రశ్నించగా.. తనకు కృష్ణ అంటే ఇష్టమని.. ఆయన ఇప్పుడు లేరని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించగా.. తనకు ఇప్పుడు ఎవరు లేరన్నారు. అంతేగాక, తానే ఓ స్టార్ అని చెప్పిన రేవంత్ రెడ్డి.. తనకే చాలా మంది అభిమానులు ఉన్నారని చెప్పారు. దీంతో ఆడియెన్స్ నుంచి హర్షధ్వానాలు చేస్తూ చప్పట్లు కొట్టారు.












Click it and Unblock the Notifications