ఉపాధ్యాయులపై ఆ జీవోతో కేసీఆర్ ఉక్కుపాదం; కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలి: రేవంత్ రెడ్డి
ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నష్టం చేకూరుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317పై కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన టీచర్లకు, ఉద్యోగులకు అన్యాయం చేస్తున్న ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Recommended Video
ఉపాధ్యాయుల ఆందోళన పై కెసిఆర్ సర్కారు అణచివేత
కెసిఆర్ తీసుకువచ్చిన జీవోతో ఉపాధ్యాయులంతా కన్నతల్లికి, జన్మభూమికి దూరమై క్షోభ అనుభవిస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 317 జీవో రద్దు డిమాండ్ తో నిన్న హైదరాబాద్ చౌక్ వద్ద ధర్నాకు తరలివచ్చిన టీచర్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారని, చాలా మంది టీచర్లను నిర్బంధంలోకి తీసుకున్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయుల ఆందోళన పై కెసిఆర్ సర్కారు ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు. వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 317 రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

జీవో నెంబర్ 317పై కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఇప్పటికే జీవో నెంబర్ 317 విషయంలో టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి మహబూబాబాద్‌లో గుండెపోటుతో చనిపోయిన టీచర్ జేతిరామ్ నాయక్ కుటుంబసభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ప్రభుత్వం తరఫున కనీసం పరామర్శ కూడా లేదని, రాష్ట్రంలో మానవత్వం లేని రాక్షస పాలన సాగుతోందని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

ఉద్యోగులు జీవో వల్ల ప్రాణాలు కోల్పోతున్నా సీఎం కేసీఆర్ కు పట్టింపు లేదు
317 జీవో కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు స్థానికతను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని మండిపడ్డారు. 317 జీవోను రద్దు చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న రాజకీయ లబ్ది కోసం ఆరాట పడుతుంది అని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీవో వల్ల ప్రాణాలు కోల్పోతున్నా సీఎం కేసీఆర్ కు పట్టింపు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జేతి రామ్ నాయక్ కుటుంబానికి అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకుని జీవో రద్దు చెయ్యాలి
317 జీవో అంశాన్ని రాష్ట్రంలో శాసన సభలోనూ, కేంద్రంలో పార్లమెంట్ లోనూ ప్రస్తావిస్తామని పేర్కొన్న రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జీవో 317 ను వెంటనే రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే దీనిపై పార్లమెంట్లో పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. ఇక తాజాగా కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకుని జీవో నెంబర్ 317ను రద్దు చెయ్యాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications