పోడు పట్టాలు ఇవ్వకుంటే చెట్టుకు కట్టెయ్యండి: మళ్ళీ రేవంత్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోడు పట్టాలు ఇవ్వకుంటే వారిని చెట్టుకు కట్టేయ్యాలని పిలుపునిచ్చారు.
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో అధికార బిఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల పాదయాత్ర ప్రారంభం నాటి నుండి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారుతున్నాయి. ఇక తాజాగా మరోమారు పోడు భూముల విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోడు భూముల విషయంలో రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
పోడు భూముల పంపిణీ వ్యవహారంపై స్పందించిన రేవంత్ రెడ్డి మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోడు భూములు ఇవ్వకుంటే చెట్టుకు కట్టెయ్యాలని ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పోడు పట్టాలు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగడానికి వచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చెట్లకు కట్టేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని ఎంతో కాలంగా తాము పోరాటం చేస్తున్నామని పేర్కొన్న రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో కూడా దీనిపై ప్రభుత్వాన్ని నిలదీశామని వెల్లడించారు.

హడావిడిగా పోడు పట్టాల పంపిణీ అందుకే
కాంగ్రెస్ పార్టీ సభలకు వెళ్ళిన వారికి పోడు పట్టాలు ఇవ్వమని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నట్టుగా పేర్కొన్న ఆయన సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారని సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు హడావిడిగా 11.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు జారీ చేస్తామని మాయమాటలు చెప్పడం అందుకేనంటూ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అర్హులందరికీ పోడు పట్టాలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులందరికి పోడు భూముల పట్టాలు ఇస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారం చేపట్టిన తొమ్మిదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం పోడు రైతులు, ఆదివాసీలపై దాడులు చేయడం తప్ప పట్టాలు ఇచ్చే విషయాన్ని పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పోడు భూముల అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడితే ఆదివాసి మహిళ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కెసిఆర్ ఆమె పైకి దూసుకొస్తూ రంకెలు వేసారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాము ఫామ్ హౌస్ భూములు, బ్యాంకులోని డబ్బులు ఇవ్వాలని అడగడం లేదని, సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని మాత్రమే అడుగుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications