రేవంత్ సీఎం అయితే మాకు మంత్రి పదవి వద్దు..!!
తెలంగాణలో సీఎం అయ్యేది ఎవరు. హైకమాండ్ కు ఈ ఎంపిక ఇప్పుడు పరీక్షగా మారుతోంది. రేవంత్ సీఎం అంటూ జరిగిన ప్రచారంతో సీనియర్లు గుర్రుగా ఉన్నారు. తమను పరిగణలోకి తీసుకోకుండా ఈ లీకు లు ఏంటని నిలదీస్తున్నారు. రేవంత్ ను సీఎం చేయాలంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పంచాయితీ ఢిల్లీకి చేరింది. హైకమాండ్ పిలుపుతో భట్టి, ఉత్తమ్ ఢిల్లీ వెళ్లారు. దీంతో..హైకమాండ్ కొత్త ఫార్ములా తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది.
పదవుల పంచాయితీ:తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పదవుల పంచాయితీ కొనసాగుతోంది. సీఎంగా రేవంత్ వైపు హైకమాండ్ మొగ్గు చూపుతుందనే సమాచారంతో సీనియర్లు ఒక్కటయ్యారు. ముందుగా హైదరాబాద్ లో వారు డీకే శివ కుమార్ తో తమ అభిప్రాయాలను స్పష్టం చేసారు. డీకే శివకుమార్ సూచనతో సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. సీనియర్ల అభిప్రాయాలను హైకమాండ్ కు డీకే శివకుమార్ నివేదించారు. దీంతో..పార్టీ హైకమాండ్ సూచన మేరకు డీకే శివకుమార్..పార్టీ పరిశీలకులు ఢిల్లీ చేరారు. తాజాగా భట్టి, ఉత్తమ్ కు పిలుపు రావటంతో ఇప్పుడు రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం అంటూ మీడియాకు లీకులు ఇవ్వడంపైనా వారంతా అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

సీనియర్ల అభ్యంతరాలు:తాను పార్టీ గెలుపు కోసం కష్టపడ్డానని తనకే సీఎం పదవి ఇవ్వాలని రేవంత్ కోరుతున్నారు. తెలిసింది. పార్టీకి అన్ని విధాలుగా సహకరిస్తానని, భవిష్యత్తులోనూ ఇలాంటి ఫలితాలే తీసుకోస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం. తనకు సీఎం పదవి తప్ప మరో పదవి అవసరం లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. రేవంత్ సీఎం అయితే తాను మంత్రిగా పని చేయలేనని ఒక సమయంలో ఉత్తమ్ అసహనం వ్యక్తం చేయగా.. డీకే సర్దిచెప్పే ప్రయత్నం చేసారని సమాచారం. తనకు సీఎం పదవి ఇవ్వకపోతే డిప్యూటీ సీఎంతోపాటు కీలక శాఖలతో మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక..
ఒకవేళ తనకు సీఎం పదవి ఇవ్వకపోతే పీసీసీ చీఫ్ పదవితోపాటు కీలక శాఖలతో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు.
ఢిల్లీ నిర్ణయంపై ఉత్కంఠ:తనకు మినహా మరో డిప్యూటీ సీఎం పదవి ఉండొద్దని ఆయన షరతు పెట్టినట్టు తెలిసింది. తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని, గతంలోనూ తాను డిప్యూటీ సీఎంగా చేశానని దామోదర రాజనర్సింహ డిమాండ్ చేసినట్టు సమాచారం. మాదిగ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అదే విధంగా పొన్నం ప్రభాకర్..వివేక్ సైతం తమకు కీలక శాఖలు అప్పగించాలని కోరినట్లు చెబుతున్నారు. స్పీకర్ పదవి విషయంలోనూ చేసిన ప్రతిపాదనలను సీనియర్లు వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ సమయంలో పార్టీ అగ్ర నాయకత్వం భట్టి..ఉత్తమ్ కు ఎలాంటి మార్గనిర్దేశం చేస్తుంది.. సీఎంతో సహా పదవుల వ్యవహారంలో ఎలాంటి ఫార్ములాతో ఈ వ్యవహారానికి ముగింపు ఇస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications