నేడే సద్దుల బతుకమ్మ.. వైభవంగా గంగమ్మ చెంతకు గౌరమ్మ!!
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మ గా నిలిచే బతకమ్మ పండుగలో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ నేడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం సద్దుల బతుకమ్మ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఒక్క హైదరాబాద్లో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ నేడు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి.
వాడవాడలా పూలపండుగ సంబరాలు జరుగుతున్నాయి. తంగేడు, గునుగు, కట్ల, బంతి, చామంతి, సీతజడలు వంటి పూలతో రోడ్లు పూలవనంలా మారాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు నేడు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ ఆడపిల్లలందరూ అత్యంత సంతోషంగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రాంతానికే సొంతమైన పండుగ .

ఇక నేడు బతుకమ్మ పండుగలో భాగంగా చివరి రోజైన సద్దుల బతుకమ్మతో పండుగ ముగియనుంది. 9వ రోజు సద్దుల బతుకమ్మను నిర్వహించే మహిళలు 9 దొంతరలుగా బతుకమ్మను పేర్చి, అంతా ఒకచోట చేరి ఆడి పాడి బతుకమ్మలను గంగమ్మ లో నిమజ్జనం చేస్తారు.కులాలకు అతీతంగా, పేద ధనిక తారతమ్యం లేకుండా, చిన్న పెద్ద అందరూ కలిసి ఘనంగా జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ.
నేడు సద్దుల బతుకమ్మ నాడు తంగేడు, గునుగు, కట్ల, చేమంతి, బంతి, మల్లె, మొల్ల, మొగలి, సంపెంగ, కలువ, తామర వంటి పూలతో బంగారు బతుకమ్మను పేర్చి సాంప్రదాయబద్దంగా గౌరమ్మను పూజిస్తారు. రాగిపళ్ళెంలో తంగేడు ఆకులు అమర్చి వాటిపై తంగేడు పూల కట్టలు పేర్చి, మధ్య మధ్యలో ఇతర పూలను వినియోగిస్తూ చాలా అందంగా బతుకమ్మను పేరుస్తారు. దానిపై పసుపుతో గౌరమ్మను తయారు చేసి పెడతారు.
ఇలా తయారు చేసిన బతుకమ్మను పూజించి, సాయంత్ర సమయంలో ఆడబిడ్డలు అందరూ పట్టు చీరలు ధరించి అందంగా ముస్తాబై ఒక చోటకు చేరుతారు. బతుకమ్మలను మధ్యలో పెట్టి ఆడి పాడి బతుకమ్మను చివరకు గంగమ్మ చెంతకు చేరుస్తారు. ఆపై గౌరమ్మకు నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని మహిళలు అందరూ పంచుకుంటారు. దీంతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి.












Click it and Unblock the Notifications