హరీష్ రావు, కవిత హౌస్ అరెస్ట్..!!
Kavitha: తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. బీఆర్ఎస్‌లో కీలక నేతలందరూ హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు. ఆయా నేతల ఇంటి ముందు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీనితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హుజూరాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌కు నిరసనగా నేడు ఆ పార్టీ నేతలు భారీ ఆందోళన నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. ట్యాంక్‌బండ్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం, నెక్లెస్ రోడ్ వద్ద నిరసన ప్రదర్శనలకు దిగాలని నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలిరావాలంటూ పిలుపునిచ్చింది. ఈ ఉదయం వాళ్లంతా ర్యాలీగా ట్యాంక్ బండ్‌కు తరలి వెళ్లాలంటూ నిర్ణయించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉదయం నుంచే హైదరాబాద్‌లో మాజీ మంత్రి టీ హరీష్ రావు, శాసన మండలి సభ్యురాలు కవిత ఇళ్ల వద్ద మోహరించారు. వారిద్దరినీ గృహ నిర్బంధంలో ఉంచారు.
దీనిపై హరీష్ రావు స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకంటూ ప్రశ్నించారు.
ఇది నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమంటూ మండిపడ్డారు. ఒకవైపు ప్రజా పాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించారంటూ ధ్వజమెత్తారు. అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వైఖరిని చూసి హైదరాబాద్ నడిగడ్డపై ఉన్న అంబేద్కర్ సైతం నివ్వెరపోతున్నాడని విమర్శించారు.












Click it and Unblock the Notifications