మావోయిస్టులకు షాక్: 34నేరాల్లో నిందితుడు; దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యుడి అరెస్ట్!!
మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యుడితో పాటు కేంద్ర కమిటీ సభ్యుల సానుభూతిపరుడుని సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యుడైన మూల దేవేందర్ రెడ్డి అలియాస్ మాధవ్ అలియాస్ కరప అలియాస్ నందును, కేంద్ర కమిటీ సభ్యులు సానుభూతిపరులుగా పనిచేస్తున్న గుర్రం తిరుపతి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరినుండి 21వేల రూపాయల నగదు, విప్లవ సాహిత్యం, ఒక పెన్ డ్రైవ్, ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూల దేవేందర్ రెడ్డి పై తెలంగాణ రాష్ట్రంలో 20, ఛత్తీస్ గడ్ లో14 కేసులు ఉన్నాయని మావోయిస్టు పార్టీ టెక్నికల్ విభాగంలో ఆయన కీలకంగా పని చేశారని వరంగల్ సీపీ ఏవి రంగనాథ్ వెల్లడించారు.

గత కొద్దికాలంగా దేవేందర్ రెడ్డికి కంటిచూపు సమస్య రావడంతో తెలంగాణ రాష్ట్ర కమిటీ అదేశాల మేరకు కంటి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్ళుతున్న క్రమంలో దేవేందర్ రెడ్డి సానుభూతిపరుడు తిరుపతి రెడ్డితో కలిసి సుబేదారి బస్ స్టాప్ వద్ద పోలీసులకు చిక్కారని పేర్కొన్నారు. పోలీసులకు చిక్కిన దేవేందర్ రెడ్డి 34 నేరాలకు పాల్పడ్డాడు.
ఇందులో ప్రధానంగా 2010 సంవత్సరంలో ఛత్తీసఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడిమెట్ల అటవీ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న సి.ఆర్.పి.ఎఫ్ పోలీసు బృందాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిగి 75 మంది సిఆర్పిఎఫ్ పోలీసులను హతమార్చి వారినుండి తుపాకులను ఎత్తుకెళ్ళిన సంఘటనలో కీలక నిందితుడు అని వెల్లడించారు. ముఖ్యంగా పోలీసులను, సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చటంలో, మందుపాతరలను పేల్చటంలో అందెవేసిన చెయ్యి. వందల సంఖ్యలో పోలీసులను హతమార్చాడు.
అంతేకాదు ఛతీస్తగడ్ మరియు ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో ఇన్స్ఫార్మర్ నేపంతో సాధారణ పౌరులను హత్య చేయడంతో పాటు, వివిధ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంలో దేవేందర్ రెడ్డి నేరస్థుడు, దేవేందర్ రెడ్డిపై 20లక్షల రూపాయల రివార్డును వుందని సిపి వెల్లడించారు. పోలీసులు అరెస్టుచేసిన సానుభూతిపరుడు తిరుపతి రెడ్డి మావోయిస్టు నాయకులకు కావల్సిన వస్తువులను అందజేయడంతో పాటు, దళసభ్యులకు రహస్యంగా చికిత్స అందించేవాడని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications