SLBC టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి ఇండియన్ ఆర్మీ; తాజా పరిస్థితి ఇదే!
తెలంగాణలో, నాగర్ కర్నూల్ లోని దోమలపెంట వద్ద ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగంలో ఒక్కసారిగా పై కప్పు కుప్పకూలటంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి జరుగుతున్న సహాయక చర్యలలో భారత సైన్యం చేరింది.
కూలిన 10 బ్లాకులు 100 మీటర్ల మేర నీరు, మట్టి
నిన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పైకప్పు కూలిపోయి టన్నెల్ లోపల భారీగా నీరు చేరింది. పని ప్రదేశం నుండి వెనక్కు దాదాపు 10 బ్లాకులు కూలిపోగా 100 మీటర్ల మేర నీరు, మట్టి కూరుకుపోయింది . అలాగే మట్టి పూడుకుపోవటంతో సహాయక చర్యలు అనేక ఇబ్బందుల మధ్య కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనలో ప్రాజెక్ట్ మరియు సైట్ ఇంజనీర్లతో సహా 12 మందికి పైగా గాయపడ్డారు. ఎనిమిది మంది సొరంగం లోపలే చిక్కుకుపోయారు.

పనులు ప్రారంభమైన నాలుగో రోజున ఈ దుర్ఘటన
టిబిఎం కు సమీపంలో పనులు చేస్తున్న జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్, రాబిన్సన్ కంపెనీకి చెందిన ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఆపరేటర్లు నలుగురు కార్మికులు అందులో చిక్కుకుపోయారని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరమణ తర్వాత ఈనెల 18వ తేదీన తిరిగి పనులు ప్రారంభం కాగా పనులు ప్రారంభమైన నాలుగో రోజున ఈ దుర్ఘటన జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో భారత సైన్యం కూడా రంగంలోకి
ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక సొరంగం వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రులు పర్యవేక్షిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో భారత సైన్యం కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.సికింద్రాబాద్ నుండి ఆర్మీకి చెందిన బైసన్ డివిజన్ ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ (ETF) సహాయక చర్యల్లో పాల్గొంటుంది. సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించటం కోసం బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
సొరంగంలో చిక్కుకున్న వారికి కాపాడే యత్నంలో
అధిక సామర్థ్యం గల పంపింగ్ సెట్లు, సాయుధ గొట్టాలు, ఎక్స్కవేటర్లు, JCBలు మరియు బుల్డోజర్లతో కూడిన ఆర్మీ వైద్య బృందాలు మరియు ఇంజనీర్లు శిథిలాలను తొలగించడానికి, సురక్షితంగా వారిని బయటకు తీసుకురావటానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి భారత సైన్యం రాష్ట్ర అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నామని రాష్ట్ర అధికారుల బృందం చెప్తుంది.
సొరంగంలో చిక్కుకున్న వారు వీరే
ఎస్ ఎల్ బి సి సురంగంలో చిక్కుకున్న 8మంది కార్మికుల పేర్లను ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, జార్ఖండ్ కు చెందిన సంతోష్ సాహు, అనూజ్ సాహు, సందీప్ సాహూ, జక్తా ఎక్సెస్, జమ్మూకాశ్మీర్ కు చెందిన సన్నీసింగ్, పంజాబ్ కు చెందిన సన్నీసింగ్ ఉన్నట్లుగా తెలిపారు.












Click it and Unblock the Notifications