కేసీఆర్ అవినీతి పాలనకు అంతం పలకండన్న స్మృతి ఇరానీ.. ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్న
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తొలి విడత ఈ రోజుతో ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లడానికి బండి సంజయ్ ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర 36 రోజుల పాటు సాగింది . ఈ రోజు ముగింపు సందర్భంగా హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరై కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న స్మృతి ఇరానీ
ఈ రోజు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత పూర్తి చేసిన సందర్భంగా బండి సంజయ్ తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బండి సంజయ్ తొలిదశ పాదయాత్ర ముగిసినట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన పెరిగిపోయిందని కెసిఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి పాలనకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర లీడర్ల పేర్లు చెప్పి ప్రజా సమస్యలపై పోరాటం కోసం వీరంతా కృషి చేస్తున్నారంటూ స్మృతి ఇరానీ పేర్కొన్నారు.

ఆ పార్టీ నేతలు చెప్పినట్టే కేసీఆర్ నడుచుకుంటారు
మోడీ ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ ఇచ్చిందని కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఉచిత రేషన్ తో పాటుగా మహిళలకు డబ్బులు కూడా ఇచ్చి ఆదుకుందని స్మృతి ఇరానీ గుర్తుచేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన స్మృతి ఇరానీ, కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులకు ఇస్తానన్న 3000 రూపాయల భృతి ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంఐఎం అంటే భయపడతారని, ఆ పార్టీ నేతలు చెప్పినట్టే కేసీఆర్ నడుచుకుంటారని స్మృతి ఇరానీ విమర్శించారు.

పేదల ఇళ్ళకు కేంద్ర పథకం .. సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారు ?
టిఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీన విలీన దినం నిర్వహించడం లేదని ఎంఐఎంకు భయపడే కెసిఆర్ సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకోవడం కోసం పేదలకు ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పిన స్మృతి ఇరానీ, టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించుకోవడం కోసం ఏమైనా సహాయం చేస్తుందా? అంటూ ప్రశ్నించారు. ఆగస్టు 28 వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర 36 రోజులపాటు 438 కిలోమీటర్ల మేర సాగింది. 8 జిల్లాలు,19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాలలో బండి సంజయ్ పాదయాత్రను కొనసాగించారు.
నేటితో బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర మొదటి విడత పూర్తి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బండి సంజయ్ సాగించిన ప్రజా సంగ్రామ పాదయాత్రకు విశేషంగా ప్రజాదరణ లభించింది. నియోజకవర్గాల వారీగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ బండి సంజయ్ ముందుకు కదిలారు. ఇక ఈ రోజు మొదటి విడత పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో రేపటి నుంచి ఆయన హుజురాబాద్ ఎన్నికలపై ఫోకస్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. సీఎం కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కోవటానికి బీజేపీ నేతలు కూడా సన్నద్దమవుతున్నారు.
Live : Addressing the Gathering at Husnabad on the final Day of Phase 1 #PrajaSangramaYatra https://t.co/SsbHUReHAr
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 2, 2021












Click it and Unblock the Notifications