తెలంగాణలో లిక్కర్ షాపుల లైసెన్సుల జారీ కోసం నోటిఫికేషన్ విడుదల: ప్రాసెస్ ఇలా
హైదరాబాద్: తెలంగాణలో మద్యం దుకాణాల(లిక్కర్ షాపులు) లైసెన్సుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని 2620 మద్యం దుకాణాలకు లైసెన్సుదారుల ఎంపికకు సంబంధించి ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కాగా, మద్యం పాలసీలో ఏలాంటి మార్పు లేదు. పాత విధానం ద్వారానే మద్యం దుకాణాల లైసెన్సీలు జారీకి ఉత్తర్వులు ఇచ్చింది.
దరఖాస్తు రుసుంలో కానీ, లైసెన్స్ ఫీజులోకాని ఏలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్యం దుకాణాల సంఖ్యలో కూడా ఏలాంటి మార్పు లేదు. ఇప్పుడున్న 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సీల ఎంపిక ప్రక్రియ మొదలు కానుంది. ఆగస్టు 3వ తేదీన అబ్కారీ శాఖ జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ చేయనుంది.

ఇక, ఆగస్టు 4వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలై 18వ తేదీ వరకు కొనసాగుతుందని అబ్కారీ శాఖ తెలిపింది. ఆగస్టు 21వ తేదీన జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో డ్రా ద్వారా లైసెన్స్‌ల ఎంపిక కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న మద్యం లైసెన్స్‌ల గడువు ఈ ఏడాది నవంబరు 30వ తేదీ వరకు ఉంది.
ఆగస్టు నెలలో మద్యం లైసెన్సుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయినప్పటికీ.. వీరి లైసెన్స్‌లు ఈ ఏడాది డిసెంబరు ఒకటో తేదీ నుంచి చెల్లుబాటు అవుతాయని అబ్కారీ శాఖ స్పష్టం చేసింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి లైసెన్సులు తమకు నిర్దేశించిన ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటుకు అవకాశం ఉంటుందని వెల్లడించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో మద్యం లైసెన్సుల ప్రక్రియను ఈ నెలలోనే పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా, కొత్తగా పొందే లైసెన్సులు రెండు సంవత్సరాల పాటు అంటే 2025 నవంబరు వరకు చెల్లుబాటవుతాయి. జనాభా ఆధారం చేసుకుని మొత్తం 6 స్లాబుల్లో అబ్కారీ శాఖ లైసెన్సులు జారీ చేయనుంది. ఐదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.50లక్షలు, ఐదు వేల నుంచి నుంచి 50 వేలు జనాభా కలిగిన ప్రాంతాలల్లో లైసెన్స్ ఫీజు రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష వరకు జనాభా కలిగిన ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.60లక్షలు, లక్ష నుంచి 5 లక్షల వరకు జనాభా కలిగిన పట్టణాల్లో లైసెన్స్ ఫీజు రూ.65లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల వరకు జనాభా కలిగిన చోట్ల లైసెన్స్ ఫీజు రూ.85లక్షలు, 20 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో రూ. కోటి పది లక్షలు లైసెన్స్ ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications