లవర్ దూరం పెట్టిందని సుత్తితో తల పగలగొట్టాడు
ప్రేమించిన యువతి తనను దూరం పెట్టిందనే కక్షతో ఒక యువకుడు రాక్షసుడిలా మారాడు. ఎనిమిదేళ్ల బంధాన్ని మర్చిపోయి, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాల్సిన అమ్మాయిని సుత్తితో బాది చంపేందుకు ప్రయత్నించాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువతిని చూసి స్థానికులు విస్తుపోయిన ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో పెను సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన బోండ్ల మహేష్, అలుగునూరుకు చెందిన స్పందన గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో పెను వివాదానికి దారితీసింది. స్పందన కుటుంబ సభ్యులు ఈ బంధాన్ని అంగీకరించకపోవడంతో, ఇటీవలే పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఎవరి దారి వారు చూసుకోవాలని, ఒకరినొకరు కలుసుకోకూడదని ఒప్పందం చేసుకున్నారు. పెద్దల మాటకు గౌరవం ఇచ్చి స్పందన.. మహేష్‌ను దూరం పెట్టింది.

ఒంటరిగా దొరికిందని సుత్తితో దాడి!
పెద్దల ఒప్పందం ప్రకారం స్పందన తనను దూరం పెట్టడాన్ని మహేష్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమె తనకే దక్కాలి, లేదంటే ఈ లోకంలోనే ఉండకూడదని క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు. స్పందన తన సోదరితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి మహేష్ లోపలికి చొరబడ్డాడు. కళ్లెదుట కనిపిస్తున్న తన మాజీ ప్రేయసిపై కనికరం లేకుండా వెంట తెచ్చుకున్న సుత్తితో తలపై, శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దెబ్బల తీవ్రతకు స్పందన అరుపులు వేస్తూ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలింది.
స్తంభానికి కట్టేసి దేహశుద్ధి
స్పందన ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే స్పందించి ఇంటి వైపు పరుగు తీశారు. అప్పటికే అక్కడి నుండి పరారవుతున్న మహేష్‌ను వెంబడించి పట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు అతడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన స్పందనను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పెచ్చరిల్లుతున్న ప్రేమోన్మాదం
ప్రేమ అంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవడమని మర్చిపోయి, తన మాట వినలేదని ప్రాణాలు తీసే వరకు వెళ్తున్న ఇలాంటి ఉన్మాదుల చర్యలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. వనస్థలీపురం ఘటన మరువక ముందే సూర్యాపేటలో ఇలాంటి ఘోరం వెలుగు చూడటం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications