బీజేపీతో టీడీపీ పొత్తు: జనం బండకేసి బాదుతారు: రేవంత్ రెడ్డి
TDP BJP Alliance: ఊహించినట్టే- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. మరోసారి భారతీయ జనతా పార్టీని ఆశ్రయించింది. బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో చేరింది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పలు దఫాలుగా చర్చలు కొనసాగించడం, షరతులకు ఓకే చెప్పిన తరువాతే ఈ చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించింది ఎన్డీఏ నుంచి.
ఇటీవలే చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తు విషయంపై చర్చించారు. సీట్ల పంపకాలపైనా తుది నిర్ణయాలను తీసుకున్నారు. బీజేపీకి కేటాయించాల్సిన సీట్లపై చంద్రబాబు నుంచి స్పష్టత తీసుకున్నారు. దీనితో ఎన్డీఏలో చేరికకు అంగీకరించారు అమిత్ షా, జేపీ నడ్డా.

బీజేపీతో పొత్తు కుదరడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ మొత్తం ఓ అతుకుల బొంతలా తయారైందని ఎద్దేవా చేశారు. ప్రతి రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారంటూ సెటైర్లు సంధించారు.
శనివారం మేడ్చల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజాదీవెన సభలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 సీట్లను సాధిస్తామంటూ బీజేపీ/ఎన్డీఏ పగటి కలలు కంటున్నాయని, అలాంటి పరిస్థితే ఉంటే పొత్తులు ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు, ఒడిశాలో నవీన్ పట్నాయక్, కర్ణాటకలో దేవేగౌడ, బిహార్‌లో నవీన్ పట్నాయక్‌తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని నిలదీశారు.
ఎన్డీఏ అతుకుల బొతను జనం హర్షించబోరని, బండకేసి బాదుతారని రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలో గతంలో అధికారంలో ఉన్న శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- కాంగ్రెస్ మహాఘట్‌బంధన్‌ను మోదీ చీల్చారని విమర్శించారు. శివసేన, ఎన్సీపీల్లో చీలకకు మోదీ కారణం కాదా? అని ప్రశ్నించారు.
ఎవరి పైనా అయితే అక్రమ కేసులు పెడతారో.. మళ్లీ వారితోనే పొత్తులకు దిగారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాజకీయాలను జనం అర్థం చేసుకున్నారని, వాటికి కాలం చెల్లిందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని జనం ఎలా ఓడించారో- కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని కూడా బండకేసి బాదడానికి 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications