వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ: మూడు కీలక బిల్లులకు ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం వాడీవేడిగా సాగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. అయినప్పటికీ ఈ సమావేశంలోనే శాసనసభ మూడు ప్రభుత్వ బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల చట్టసవరణ, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును ముఖ్యమంత్రి తరపున దేవాదాయశాఖా మంత్రి కొండా సురేఖ శాసనసభలో ప్రవేశపెట్టారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉద్దేశాలు, లక్ష్యాలను మంత్రి తెలియజేశారు. ఈ దశలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. పరిశ్రమల కోసం భూసేకరణ, రైతుల అక్రమ అరెస్టులపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు చేపట్టాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ప్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు.

మరోవైపు, ఇదే సమయంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయనందుకు తాము ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు విషయమై బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. ఇరు పార్టీల సభ్యులు సభలో నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే కాంగ్రెస్ సభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ క్రీడా విశ్వవిద్యాలయం బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. విపక్ష సభ్యుల ఆందోళనపై ఘాటుగా స్పందించారు అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధర్ బాబు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని, పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసును సభాపతి నిబంధనల మేరకు చేపడతారన్నారు. అయినప్పటికీ.. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల ఆందోళన కొనసాగుతుండటంతో.. ఆ సమయంలోనే బిల్లులను ఆమోదానికి ప్రవేశపెట్టారు. మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టిన క్రీడా విశ్వవిద్యాలయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లును సీఎం తరఫున మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనలు జరుగుతుండటంతో రెండు బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండానే అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
పర్యాటక విధానంపై స్వల్ప చర్చ అనంతరం సభను గురువారం నాటికి స్పీకర్ వాయిదా వేశారు. గురువారం మరో నాలుగు కీలక బిల్లులు శాసనసభ ముందుకు రానున్నాయి. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు తోపాటు మరో రెండు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.












Click it and Unblock the Notifications