క్లీన్ స్వీప్‌పై కన్నేసిన బీఆర్ఎస్- 119 నియోజకవర్గాల్లో వార్ రూమ్స్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం ఎన్నికల కౌంటింగ్ కూడా అదే రోజున వెలువడుతుంది. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

పోలింగ్‌కు నెలన్నర రోజుల గడువు ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి ఇప్పటికే జనంలోకి వెళ్లింది. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పలు జిల్లాల్లో భారీ ఎత్తున ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహిస్తోన్నారు.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో విజయం సాధించడానికి అన్ని వనరులను వినియోగించుకుంటోంది బీఆర్ఎస్. సర్వశక్తులను ఒడ్డుతోంది. ఎన్నికల జోరును మరింత పెంచింది బీఆర్ఎస్. రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వార్ రూమ్స్‌ను ఏర్పాటు చేసింది. దీనికోసం 350 మందిని కొత్తగా నియమించుకుంది. ప్రతి నియోజకవర్గంలో వార్ రూమ్‌ను నెలకొల్పింది.
ఆయా నియోజకవర్గాల ఎన్నికల ప్రచార సరళిని పర్యవేక్షించడం, ఎన్నికల మేనిఫెస్టోను ప్రతి ఒక్క ఓటర్‌కూ అర్థం అయ్యేలా వివరించడం ఈ వార్ రూమ్ ముఖ్య ఉద్దేశం. అభ్యర్థి సహా- పార్టీ క్యాడర్ మొత్తానికీ దిశా నిర్దేశం చేస్తుంది ఈ వార్ రూమ్. అధిష్ఠానం నుంచి అందే సమాచారాన్ని అభ్యర్థితో పాటు పార్టీ కార్యకర్తలకు చేరవేస్తుంది. పార్టీ అగ్ర నాయకత్వానికి- ఓటర్ మధ్య వారధిలా పని చేస్తుంది.

నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న ప్రచార సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందజేయాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), వాట్సప్, యూట్యూబ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌ను ఉపయోగించుకుంటూ రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలు, ఆరోపణలను తిప్పి కొట్టడంతో పాటు పార్టీ క్యాడర్‌ను ఎన్నికల సమరానికి ఈ వార్ రూమ్ సిద్ధం చేస్తుంది.
ఈ వార్ రూమ్ ఇన్‌ఛార్జీలతో బీఆర్ఎస్ అగ్ర నేతలు, మంత్రులు కేటీఆర్, టీ హరీష్ రావు నేడు సమావేశం కానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో ఈ సమావేశం ఏర్పాటైంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. వార్ రూమ్ ఇన్‌ఛార్జీలకు దిశానిర్దేశం చేస్తారు.












Click it and Unblock the Notifications