మా ఎన్నికల్లో తుకడే గ్యాంగ్‌కు గుణపాఠం: మెగా కాంపౌండ్‌పైనా బండి సంజయ్ సెటైర్లు
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల పట్ల రాజకీయ పార్టీలు స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యుడిగా ఉన్న మెగా కాంపౌండ్ మద్దతుదారుడిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ ఓడిపోవడం, ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా ముద్ర ఉన్న మంచు విష్ణు ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడం రాజకీయ రంగు పులుముకోవడానికి కారణమైంది.

రాజకీయ పార్టీలు హర్షం
మంచు విష్ణు విజయం సాధించడాన్ని వైఎస్సాఆర్‌సీపీ ఇప్పటికే తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. మంచు విష్ణుకు అభినందనలను తెలియజేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఓ ట్వీట్ చేశారు. చిత్ర పరిశ్రమను పురోగమనానికి కృషి చేయాలని అకాంక్షించారు. గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో సినీ కళాకారులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

బండి సంజయ్ కూడా..
ఆ కొద్దిసేపటికే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్పందించారు. మంచు విష్ణుకు అభినందనలను తెలియజేశాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. రెండు ప్యానెల్స్‌లో విజయం సాధించిన సభ్యులను ఆయన అభినందించారు. జాతీయవాద వ్యతిరేక శక్తులను చిత్తుగా ఓడించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలను తెలియజేస్తున్నానని బండి సంజయ్ అన్నారు.
తుకడే గ్యాంగ్..
ప్రకాష్ రాజ్‌ను తుకడే గ్యాంగ్‌తో పోల్చారు బండి సంజయ్. ఆయన పేరును ఎక్కడా ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. అయినప్పటికీ.. ప్రకాష్ రాజ్ ఓటమిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకడే గ్యాంగ్‌కు మద్దతిచ్చిన వారికి మా ఎన్నికలు సరైన గుణపాఠం చెప్పాయని వ్యాఖ్యానించారు. మా ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠభరితంగా ఎదురు చూశారని పేర్కొన్నారు.
స్ఫూర్తిదాయక తీర్పు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. భారత్ మాతా కీ జై అంటూ తన ట్వీట్లను బండి సంజయ్ ముగించారు. ప్రకాష్ రాజ్ బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తోన్న విషయం తెలిసిందే. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిపై ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. బీజేపీ అంటే ప్రకాష్ రాజ్‌కు పడదు.
Recommended Video
తమ్ముడా..మజాకా
విష్ణు సోదరి మంచు లక్ష్మీ కూడా సంతోషం వ్యక్తం చేశారు. నా తమ్ముడా.. మజాకా.. అద్భుతమైన విజయాన్ని నా హీరో సాధించాడు అని మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు. హిందీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌తో ఉన్న కలిసి దిగిన ఫొటోను లక్ష్మి ట్వీట్ చేయగా, ఆయన భార్య జెనీలియాతో కలిసి దిగిన ఫొటోను మంచు విష్ణు రీట్వీట్ చేశారు. జెనీలియాకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉంది. ఇదివరకు విష్ణుతో కలిసి ఆమె ఢీ మూవీలో నటించారు.












Click it and Unblock the Notifications