సోమేష్ కుమార్‌పై కంప్లైంట్- ఏకంగా ఈసీకి లెటర్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
అటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు సమాయాత్తమౌతోన్నాయి. బీఆర్ఎస్‌కు ధీటుగా వ్యూహాలను రూపొందిస్తోన్నాయి. ఇప్పటికే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. బహిరంగ సభలో ప్రసంగించారు. మున్ముందు మరిన్ని కార్యక్రమాలకు ఆమె హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు.

ఈ పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ నాయకులు మరో అడుగు ముందుకేశారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, కేసీఆర్ సలహాదారు సోమేష్ కుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మకు లేఖ రాశారు. సోమేష్ కుమార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను తారుమారు చేయడంలో దిట్టగా అభివర్ణించారు.
పదవీ విరమణ పొందిన అధికారులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడాన్ని నిషేధిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను రూపొందించిందని, సోమేష్ కుమార్.. వీటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోన్నారని పేర్కొన్నారు. అధికారుల బదిలీలు, పోస్టింగుల వంటి కార్యకలాపాల్లో పాల్గొంటోన్నారని, ఇది అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్స్‌కు భిన్నమని చెప్పారు.
అధికారులను బదిలీ చేయించడం, వారిని ఎక్కడ? ఏ స్థానాల్లో అపాయింట్ చేయాలనే విషయాలపై ప్రభుత్వ సలహాదారు హోదాలో సోమేష్ కుమార్ ఆదేశాలను జారీ చేయడం సరి కాదని అన్నారు. 2015లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా పని చేసిన సమయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా నుంచి లక్షలాది పేర్లను అక్రమంగా తొలగించారని ఆరోపించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్‌లో ఎస్ఐ మొదలుకుని, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, లా అండ్ ఆర్డర్ ర్యాంక్ ఉద్యోగులు సంవత్సరాల తరబడి పని చేస్తోన్నారని, ప్రభుత్వం వారిని బదిలీ చేయట్లేదని బీజేపీ నాయకులు.. ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం.. బదిలీలు జరగట్లేదని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications