నేను ఇట్లా వెళతాను అని చెబుతున్న KCR!
సాధారణంగా షెడ్యూల్ ప్రకారం లోక్ సభ ఎన్నికలు జరగడానికి 14 నెలల సమయం ఉంది. ఇంత తక్కువ సమయంలో భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నారు. ఇందుకు ఆయన ఎంచుకున్న ఏకైకా మార్గం కిసాన్ సెల్. రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోన్న బీజేపీ ప్రభుత్వంపై పోరాడేందుకు రైతుల సమస్యలపై పోరాడటంద్వారా పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచించుకుంటున్నారు. పంజాబ్, ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు.

కేసీఆర్ ను ప్రశ్నిస్తున్న రైతుసంఘాలు
'ఆప్ కీ బార్ కిసాన్' సర్కార్ పేరుతో ఆయన దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరునెలల సమయంలో దాదాపుగా అన్ని ప్రాంతాలను చుట్టిరావాలనేది కేసీఆర్ ప్రణాళికగా ఉంది. అయితే ఏపీకి, తెలంగాణ ప్రభుత్వానికి జలవివాదాలు నడుస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుతోపాటు కృష్ణా జలాల విషయంలో ఏపీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటువంటి తరుణంలో రైతుల తరఫున పోరాడతామని ఎలా చెప్పగలుగుతారంటూ రైతుసంఘాల నాయకులు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో చోటుంటుందా?
ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీతోపాటు మరికొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. ఇన్ని పార్టీల మధ్య భారత రాష్ట్ర సమితికి చోటుంటుందా? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. అయితే స్థానిక రాజకీయాల గురించి మాట్లాడకుండా కేవలం రైతులకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, వ్యవసాయ చట్టాలకు చేసిన సవరణలను ప్రజలకు తెలియజేస్తూ దీన్ని మాత్రమే పునాదిగా చేసుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

8 సంవత్సరాల పాలనే ప్రచారం
కేసీఆర్ 8 సంవత్సరాల పాలనతో కాళేశ్వరం ప్రాజెక్టుద్వారా విద్యుత్తు, నీటిపారుదల రంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో 'రైతు బంధు' పథకంద్వారా కూడా రైతులకు మేలు కలిగింది. ప్రాజెక్టుల నిండుగా నీరుండటంతో దిగుబడులు పెరిగాయి. 'రైతు బంధు'
పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలను ఆకర్షించింది. తెలంగాణ నుంచి ఏపీకి సాగునీరు రాకుండా అడ్డుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఏపీలో ఎంతవరక మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే దానికి సంబంధించి తమ నేత ఏదో ఒక వ్యూహాన్ని సిద్ధం చేసి ఉంటారనే నమ్మకాన్ని భారత రాష్ట్ర సమితి నాయకులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications