రేవంత్ ప్రమాణ స్వీకార వేదికపై ఆకట్టుకున్న ఆ సన్నివేశం: కూతురు, అల్లుడు, మనవడిని పరిచయం
Revanth Reddy: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో- గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దైవసాక్షిగా ప్రమాణం చేశారు రేవంత్.
భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం తరువాత ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు రేవంత్ రెడ్డి. మరుగుజ్జు వికలాంగురాలు రజినికి ఉద్యోగాన్ని కల్పించడానికి ఉద్దేశించిన ఫైల్‌పై రెండో సంతకం చేశారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతానంటూ హామీ ఇచ్చారు.
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన తన భార్యతో కలిసి సోనియా గాంధీ ఆశీర్వాదాన్ని తీసుకోవడం ఆకట్టుకుంది. నేరుగా తన భార్యతో కలిసి సోనియాగాంధీ వద్దకు వెళ్లి పాదనమస్కారం చేశారు. తన భార్యను పరిచయం చేశారు. తన కూతురు, అల్లుడు, మనవడిని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలకు పరిచయం చేశారు.












Click it and Unblock the Notifications