కృష్ణా, గోదావరి జలాల్లో మా వాటా తేల్చాల్సిందే.. కేంద్రంపై సీఎం రేవంత్ ఒత్తిడి
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవటంతో పాటు, ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ముఖ్యమంత్రి సూచనలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ రాశారు. ఈనెల 16న దిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రితో సమావేశమై తెలంగాణ నీటి వాటాల సాధనతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు.

"కృష్ణా నదీ జలాల వినియోగంలో ఇంతకాలం తెలంగాణకు తీరని ద్రోహం జరిగింది. గడిచిన పదేండ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైంది. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టింది. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ వంత పాడి, కృష్ణా నీళ్లను ఏపీ యథేచ్ఛగా మళ్లించుకుంటే మౌనం వహించింది" అని మండిపడ్డారు.
"ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసింది. అటు గోదావరిపై తుమ్మిడిహెట్టిపై చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత పక్కనబెట్టింది. దానికి బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్ష కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేసింది" అని సీఎం రేవంత్ దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications