రైతులకు ఎకరానికి రూ. 10 వేలు ఇచ్చే ఆలోచనలో రేవంత్ సర్కార్!
ఎల్నినో ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులపై సమగ్ర నివేదిక రూపొందించిన ప్రభుత్వ యంత్రాంగం, బాధిత రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించాలని ముఖ్యమంత్రికి ప్రతిపాదించింది.
తెలంగాణ వ్యవసాయ రంగం ఎల్నినో ప్రభావంతో తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే 17 నుంచి 20 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అనేక జిల్లాలు వర్షాభావంతో బాధపడుతున్నాయి. మొత్తం రాష్ట్రంలో 320 మండలాల్లో వర్షాభావం ఉండగా, అందులో 117 మండలాల్లో అత్యంత తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రధాన జలాశయాలు, చిన్న నీటిపారుదల చెరువుల్లో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. వేలాది చెరువులు 25-50 శాతం కంటే తక్కువ నీటితో ఉన్నాయి. భూగర్భ జలాలు వేగంగా క్షీణిస్తున్నాయి. ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో సాగునీటి కంటే తాగునీటికే ప్రాధాన్యం ఇస్తోంది. దిక్కుతోచని దయనీయ పరిస్థితికి రైతులు చేరుకున్నారు.
ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఎల్ నినో పరిస్థితులపై నిర్వహించిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 320 మండలాల్లో వర్షాభావం ఉండగా, అందులో 117 మండలాల్లో అత్యంత తీవ్రమైన కరువు తాండవిస్తోందని అధికారులు వెల్లడించారు. మొత్తం 11.18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. వాడిపోతున్న 7 లక్షల ఎకరాల పంటలకు కనీసం ఒక్క తడికైనా సాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పంట నష్ట పరిహారంతో పాటు పశుసంవర్ధక శాఖ సహాయక చర్యలు, తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కలిపి మొత్తం రూ.2,170.68 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి జిల్లా కలెక్టర్కు రూ.కోటి చొప్పున నిధులు కేటాయించాలని సూచించారు.
అధికారుల నివేదికలోని ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపేందుకు సచివాలయంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం రైతులకు అందించే కరువు సహాయక చర్యలపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది. రైతుల ఆందోళన తగ్గించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని అంచనా.












Click it and Unblock the Notifications
