Telangana elections:వరంగల్ తూర్పులో బిగ్ ఫైట్: బరిలో ఎవరంటే!!
రాజకీయంగా, ఉద్యమాల పరంగా, వ్యాపార వాణిజ్య పరంగా వరంగల్ జిల్లా ప్రత్యేక స్థానం ఉంది . ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో వరంగల్ తూర్పు జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా రసవత్తరంగా మారనున్నాయి. ప్రతిసారి వరంగల్ తూర్పులో త్రిముఖ పోటీ ఉన్నట్టుగానే, ఈ సంవత్సరం కూడా బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ మధ్యనే త్రిముఖ పోటీ ఉండబోతోంది.
వరంగల్ తూర్పు ఓటర్లు
తాజాగా ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ జాబితా లెక్కల ప్రకారం తూర్పు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,46,282 కాగా వారిలో పురుషులు 1,20,323, మహిళా ఓటర్లు 1,25,621, ఇతరులు 338 మంది ఉన్నారు. 2014 ఎన్నికలలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జనరల్ కేటగిరీలో బీఆర్ఎస్ పార్టీ, నాటి టిఆర్ఎస్ నుండి కొండ సురేఖ పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బస్వరాజు సారయ్యపై 52085 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

బీఆర్ఎస్ సిట్టింగ్ కే టికెట్
2018 ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన వద్దిరాజు రవిచంద్రపై 28,782 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వరంగల్ తూర్పులో అధికార బిఆర్ఎస్ నుంచి మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పై నమ్మకం తో ముఖ్యమంత్రి కెసిఆర్ మరో సారి అవకాశం ఇచ్చారు. ఇక బీజేపీ నుండి ఈ సారి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
వరంగల్ తూర్పులో త్రిముఖ పోరు
దాదాపు ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా పార్టీ శ్రేణుల్లో చర్చ కూడా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుండి కొండా సురేఖ తానే పోటీలో ఉంటానని ప్రకటన చేసి ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈసారి ఎన్నికలలో నన్నపునేని నరేందర్, కొండ సురేఖ, ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య త్రిముఖ పోరు కొనసాగనుంది. ఇప్పటికే ఎవరికి వారు ప్రజా క్షేత్రంలో ఓటర్ల మద్దతు గెలవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
వరంగల్ తూర్పులో సమస్యలు ఇవే
వరంగల్ తూర్పు సమస్యల విషయానికి వస్తే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సమీకృత కలెక్టర్ కార్యాలయాలు దాదాపు సిద్ధం కాగా, వరంగల్ జిల్లాకు మాత్రం ఇప్పటివరకు సమీకృత కలెక్టరేట్ తో పాటు మంచి బస్టాండ్ కూడా లేకపోవడం ఇక్కడి సమస్యలకు నిదర్శనం. దీంతో పాలనా కార్యాలయమే లేకపోవడంతో పాటు అన్ని విషయాలలోనూ వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో కొంత వెనుకబడి ఉంది.

మౌలిక సదుపాయాలకే తిప్పలు
వరంగల్ నగరంలో భూముల సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు, సాగునీటి వసతి వంటి మౌలిక సదుపాయాల సమస్య కూడా పీడిస్తోంది. ఇటీవల వరంగల్ మోడల్ బస్ స్టేషన్ కు మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేసినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు జరుగుతున్నప్పటికీ, ఉన్న ఎంజీఎం నే పట్టించుకునే దిక్కులేదనే అసహనం ప్రజల్లో వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications