తెలంగాణా ఎన్నికలు: కేసీఆర్ ఫోకస్ ఆ మూడింటిపైనే!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని, తెలంగాణలో తమ పార్టీ జెండాను ఎగురవేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రెండు దఫాలుగా అధికారాన్ని కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేయాలని భావిస్తోంది.
ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి పెట్టి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తుంటే, సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజల మద్దతును కూడగట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

ఇక ఇదే సమయంలో మూడు అంశాల పైన సీఎం కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించి త్రిముఖ వ్యూహంతో వెళుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తామే ఉన్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం కోసం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుండి కానీ, బిజెపి నుండి కానీ బలమైన నాయకులను పార్టీలోకి చేర్చుకునేందుకు చేరికలపైన ప్రధానంగా దృష్టి సారించాలని బీఆర్ఎస్ అధినేత పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
కుల సమీకరణల ఆధారంగా కూడా కొంతమందిని పార్టీలోకి చేర్చుకోవాలని, కాంగ్రెస్ పార్టీ బలహీన పడేలా ఆ పార్టీ నుండి చేరికలు ఉండాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ లో పలువురు కీలక నాయకులు అసంతృప్తితో ఉన్నారని గుర్తించిన కేసీఆర్ వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ను, హరీష్ రావును రంగంలోకి దింపి అసంతృప్త నేతలను పిలిపించి, చర్చలు జరిపి వారిని బుజ్జగిస్తున్నారు.

ఎన్నికలలో పార్టీ కోసం పని చేసేలా వారిని అనునయించి అసంతృప్తి లేకుండా బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టి, పార్టీ నుండి బయటకు ఎవరు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సీఎం కెసిఆర్ ఫోకస్ చేస్తున్న మరో ముఖ్యమైన అంశం హామీలు. ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ మేనిఫెస్టోల పేరుతో ఉచిత హామీల వర్షం కురిపిస్తుంది.
ఈనెల 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ కూడా మేనిఫెస్టోను ప్రకటించనున్న నేపథ్యంలో ప్రజలకు ఉచితాల హామీలను ఇవ్వనుంది. ఇక మరోవైపు పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చే వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులను ఇస్తామని హామీ ఇచ్చి, వారిలో ఉత్సాహాన్ని నింపి ఎన్నికల కురుక్షేత్రం లోకి వారికి దింపే ప్రయత్నం చేస్తున్నారు కెసిఆర్. మొత్తంగా ఈ మూడు అంశాల పైన ప్రధానంగా దృష్టి పెట్టిన కెసిఆర్ మళ్ళీ అధికారంలోకి రావడం పక్కా అని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications