తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుపై గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ కామెంట్స్
Allu Aravind: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఇక ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP meeting) నేత ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని సీఎల్పీ సమావేశం.. పార్టీ అధిష్ఠానానికి వదిలివేసింది. హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని తెలిపింది. ఫలితంగా- సీఎం క్యాండిడేట్‌పై ఉత్కంఠత నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ విజయాన్ని తాము స్వాగతిస్తోన్నామని ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ అన్నారు. త్వరలోనే టాలీవుడ్ తరఫున కాంగ్రెస్ పెద్దలను కలుస్తామని చెప్పారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పట్ల చిత్ర పరిశ్రమ సంతోషంగా ఉందని అల్లు అరవింద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోండటం శుభపరిణామం అని వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్న ప్రతీసారీ సినీ పరిశ్రమను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్తేమీ కాదని అన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వాలు.. చిత్ర పరిశ్రమతో సత్సంబంధాలను కొనసాగించాయని అల్లు అరవింద్ గుర్తిచేశారు. పరిశ్రమ కూడా ఎప్పుడూ కాంగ్రెస్‌కు అండగానే నిలిచిందని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించాయని పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందనుకుంటున్నామని అల్లు అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మర్యాదపూరకంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రభుత్వ పెద్దలను కలుస్తామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం ఉంటే చాలని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications