
Dalith Bandhu Guidelines: 'దళిత బంధు'కు మార్గదర్శకాలు ఇవే-ఆ 3 కమిటీలు కీలకం-పథకంపై పాటలు రాయబోతున్న కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయబోతున్న దళిత బంధు పథకానికి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. పథకం అమలుకు జిల్లా,మండలం,గ్రామ స్థాయిల్లో కమిటీలను నియమించనున్నట్లు తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. పథకం అమలు ప్రక్రియ మొత్తం కమిటీల పర్యవేక్షణలోనే జరగనుంది. పథకంపై అమలుపై అవగాహన సదస్సుల నిర్వహణ,డేటా బేస్‌లో అర్హులైన దళిత కుటుంబాల రిజిస్ట్రేషన్లు,కలెక్టర్ జారీ చేసే నిధుల మంజూరు పత్రాలను పంపిణీ చేయడం తదితర పనులన్నీ కమిటీలే నిర్వర్తించనున్నాయి.

కమిటీల్లో ఎవరెవరు ఉంటారు...
దళిత బంధు పథకం అమలు కోసం నియమించనున్న కమిటీల్లో.. జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఉంటుంది. ఇందులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జెడ్పీ సీఈవో, డీఆర్‌డీఏ,వ్యవసాయ,పశుసంవర్ధక రవాణా,పరిశ్రమల విభాగాల నుంచి కొంతమంది అధికారులను సభ్యులుగా చేరుస్తారు. అలాగే మున్సిపల్ కమిషనర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో పాటు కలెక్టర్ నామినేట్ చేసే మరో ఇద్దరు సభ్యులు కూడా కమిటీలో ఉంటారు. మండలస్థాయిలో ఎంపీడీవో, తహసీల్ధార్, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల అధికారులతో పాటు ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. గ్రామస్థాయి కమిటీలో పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి, ఇద్దరు నామినేటెడ్ ఉంటుంది.

కమిటీలు నిర్వర్తించే విధులు...
మహిళల ఖాతాల్లోనే దళిత బంధు డబ్బు రూ.10లక్షలు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎస్సీ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి.కరుణాకర్ వెల్లడించారు. అర్హులైన దళిత కుటుంబాలకు చెందిన మహిళల బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తామన్నారు.ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలను మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. దళిత బంధు కమిటీ పర్యవేక్షణకు నియమించనున్న జిల్లా స్థాయి కమిటీలు స్క్రీనింగ్,రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడుతాయి. జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన ప్రొసీడింగ్స్‌ను జారీ చేయడం, ఎంపికైన దళిత కుటుంబాలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో విడుదల చేయడం, అవసరమైన చోట కెపాసిటీ బిల్డింగ్, మెంటార్షిప్ అందించడం, పథకం కింద లబ్దిపొందిన కుటుంబాలు వారు ఎంపిక చేసుకున్న యూనిట్‌ను ప్రారంభించేలా అవసరమైన సహాయం అందించడం, లబ్దిదారుల కుటుంబాలకు క్యూఆర్ కోడ్ గుర్తింపు కార్డు జారీ చేయడం, ఇన్సూరెన్స్ ఏజెన్సీ(పబ్లిక్ సెక్టార్) నుంచి యూనిట్ ధరకు సరిపడే ఇన్సూరెన్స్ లభించేలా ఇన్సూరెన్స్ ఇప్పించడం వంటి విధులు నిర్వర్తిస్తారు.

దళిత రక్షణ నిధి ఏర్పాటు...
మండల, గ్రామ స్థాయి కమిటీలు లబ్దిదారుల కుటుంబాలతో నెలవారీగా అవగాహన సదస్సులు,ఇతరత్రా సమావేశాలు నిర్వహిస్తాయి. సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాయి. వీటికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు డేటా బేస్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో దళిత రక్షణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.దళిత బంధు పథకం కింద లబ్ది పొందిన కుటుంబాల నుంచి రూ.10 వేలు, అంతే సమాన మొత్తాన్ని జిల్లా ఎస్సీ కార్పోరేషన్ నుంచి తీసుకుని రూ.20 వేలు దళిత రక్షణ నిధిలో చేరుస్తారు. ఈ నిధి కోసం ప్రత్యేక ఎస్బీఐ ఖాతాను తెరవాలి. ప్రతీ ఏడాది లబ్దిదారుల కుటుంబాలు దళిత రక్షణ నిధికి రూ.1వెయ్యి కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. దళిత బంధు లబ్ధిదారుల కుటుంబాల్లో ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వారి రక్షణ కోసం ఈ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. దళిత రక్షణ నిధి జిల్లా స్థాయి కమిటీ పర్యవేక్షణలో ఉంటుంది.

పాటలు రాయనున్న కేసీఆర్...
దళితబంధుపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ప్రభుత్వం సాంస్కృతిక విభాగం సేవలు వినియోగించుకోనుంది. రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో దీనిపై ప్రచారం నిర్వహించేందుకు రాష్ట్రంలోని ప్రముఖ రచయితలు, కళాకారులతో సీఎం కేసీఆర్ ఇటీవల సమావేశమయ్యారు. పథకం ఉద్దేశాన్ని వివరిస్తూ ఎలాంటి పాటలు రాయాలో దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు కళాకారులు రాసిన పాటలను పరిశీలించి సలహాలు,సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కూడా పాటలు రాసే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్సీ, ప్రముఖ రచయిత గోరటి వెంకన్న, సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్, రచయితలు, కళాకారులు కోదాడి శ్రీను, అంబటి వెంకన్న, మిట్టపల్లి సురేందర్, అభినయ శ్రీనివాస్, బోడ చంద్రప్రకాశ్, మానుకోట ప్రసాద్, ఏకే బిక్షపతి, బాబు, శివ తదితరులు దళిత బంధుపై పాటలు రాయనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఈ నెల 16న పాటల విడుదల
దళిత బంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం మేరకు ఇప్పటివరకూ 8 పాటలను పూర్తిచేశామని రసమయి బాలకిషన్ తెలిపారు. త్వరలోనే ఈ పాటలకు కళారూపం ఇస్తామని చెప్పారు. ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్ వేదికపై దళిత బంధు ఆడియో, వీడియో సాంగ్స్ విడుదల చేస్తామన్నారు. తెలంగాణ కోసం ఉద్యమ సమయంలో ఉవ్వెత్తున ఎగసిన ధూంధాం కార్యక్రమాల తరహాలో... అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం, సీఎం ఆశయసాధన కోసం దళితబంధు పైనా అదేస్థాయిలో ధూంధాం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. అదే రోజు ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటివరకూ చాలామంది పేర్లు వినిపించినప్పటికీ టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును దాదాపుగా ఖరారు చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత,ఉద్యమ కారుడు,స్థానికుడు కావడంతో గెల్లు శ్రీనివాస్‌కే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.