కాంట్రాక్టు పెళ్లిళ్లపై తెలంగాణ సర్కారు సంచలన బిల్లు
హైదరాబాద్‌లో చోటు చేసుకుంటున్న కాంట్రాక్ట్ మ్యారేజీలు, అరబ్ షేక్‌ల ఆగడాలను అరికట్టేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
హైదరాబాద్: నగరంలో చోటు చేసుకుంటున్న కాంట్రాక్ట్ మ్యారేజీలు, అరబ్ షేక్‌ల ఆగడాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల ముస్లిం మైనర్ బాలికలను వివాహం చేసుకునేందుకు వచ్చిన అరబ్ షేక్‌లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

గల్ఫ్ దేశాల్లో చిత్రహింసలు..
గల్స్ దేశాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన అరబ్ వృద్ధ షేక్‌లు పెళ్లి పేరిట నిరుపేద మైనర్ బాలికలను వారి దేశాలకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేయడంతోపాటు వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కాంట్రాక్ట్ పెళ్లిళ్లను నివారించేలా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కొత్త బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది.

ఇక వృద్ధ షేక్‌లతో పెళ్లిళ్లు..?
అసెంబ్లీ సమావేశాలు ఆలస్యమైతే ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా వృద్ధ షేక్ లతో మైనర్ బాలికల వివాహాలు జరగకుండా నివారించేలా కొత్త చట్టంతో బిల్లు రూపొందిస్తూ రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రభుత్వానికి ఒక ఫైలు పంపించారు.

అక్రమ రవాణా కిందకే..
పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాలికలు, యువతులతో గడిపి ఆపై విడాకులు ఇవ్వడం.. అక్రమ రవాణా కిందకే వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త బిల్లుపై అడ్వకేట్ జనరల్ సమీక్షించాక దాన్ని సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపించనున్నట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి ఒమర్ జలీల్ వెల్లడించారు.

ఇక కష్టమే..
అరబ్బులు భారతీయ మహిళలను పెళ్లాడాలంటే మొదట వారి దేశ అనుమతి పొందాలని బిల్లులో పొందుపర్చారు. దీంతోపాటు అరబ్ షేక్‌ల వయసు, వధువు వయసుల మధ్య పదేళ్ల కంటే ఎక్కువ తేడా లేకుండా చర్యలు తీసుకోనున్నారు. అంతేగాక, ఖాజీలే మధ్యవర్తులుగా అరబ్ షేక్‌లతో మైనార్ బాలికల వివాహలు జరిపిస్తే వారిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.












Click it and Unblock the Notifications